Andhra Pradesh: రోజూ ప్రత్యేక మెనూ

CM YS Jagan Special menu every day in government welfare hostels - Sakshi

హాస్టళ్లలో మంచి భోజనం.. టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయం

గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై సమీక్షలో సీఎం జగన్‌ 

హాస్టళ్లలో రెండు దశల్లో, గురుకులాల్లో మూడు దశల్లో నాడు–నేడు 

హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేక అధికారుల నియామకం 

ఇందుకు ప్రత్యేక యాప్‌.. కాస్మొటిక్స్‌లో నాణ్యత ముఖ్యం 

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను వైద్యులు పర్యవేక్షించాలి 

కిచెన్‌ ఆధునికీకరణ, ఫర్నిచర్  కోసం ప్రతిపాదనలు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రతి రోజు ప్రత్యేక మెనూ అమలు చేయడంతో పాటు టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో రెండు దశల్లో, గురుకుల పాఠశాలల్లో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో పూర్తి చేయాలని చెప్పారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు.

గురుకులాల విద్య (అకడమిక్‌) వ్యవహారాల పర్యవేక్షణను పాఠశాల విద్య (స్కూల్‌ ఎడ్యుకేషన్‌) పరిధిలోకి తేవాలని చెప్పారు. మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న మండల విద్యా శాఖ అధికారు(ఎంఈఓ)లకే గురుకులాల అకడమిక్‌ బాధ్యతలు అప్పగించాలా.. లేక మరో విధంగా చేయాలా.. అనే విషయంపై పూర్తి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ‘మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఏ విధంగా పర్యవేక్షణను పటిష్టం చేస్తున్నామో.. గురుకులాల్లో కూడా అదే తరహాలోనే పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్‌ (ఎస్‌ఓపీ), ప్రత్యేక యాప్‌ రూపొందించాలి.

గురుకుల పాఠశాలలు, వెల్ఫేర్‌ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం ఒక్కో అధికారి ప్రత్యేక పరిధిని నిర్ణయించి సమగ్రంగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలి’ అని ఆదేశించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
నాణ్యమైన భోజనం పెట్టాలి 
► రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి పెట్టే భోజనం అత్యంత నాణ్యతగా ఉండాలి. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలి. ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వండి.  
► హాస్టల్‌ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్‌ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలి. విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో పారిశుధ్యం, పరిశుభ్రతలపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీని లింక్‌ చేయడంపై కూడా శ్రద్ధ వహించాలి. హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. 
► వైద్యులు క్రమం తప్పకుండా హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలి. (ఇందుకోసం ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు) విలేజ్‌ క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్‌ చేయాలి. హాస్టళ్ల నిర్వహణలో సిబ్బంది ఖాళీలను గుర్తించి, భర్తీ చేయాలి. వీటన్నింటిపై తగిన కార్యాచరణ సిద్ధం చేసి నాకు నివేదించాలి. 
 
నాడు–నేడు ప్రతిపాదనలు ఇలా 
► రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు–నేడు కింద టాయిలెట్లు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్‌ పనులు, సిబ్బందికి.. విద్యార్థులకు ఫరి్నచర్‌.. డెస్క్‌లు, బంకర్‌ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్‌ టేబుల్, గార్బేజ్‌ బిన్స్‌ తదితరాలకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.  
► కిచెన్‌ ఆధునికీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్‌ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్‌ మెషీన్, ప్రెషర్‌ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్‌ వెసల్స్, డస్ట్‌ బిన్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 55 ఇంచ్‌ల స్మార్ట్‌ టీవీతో పాటు క్రీడా సామగ్రి, లైబ్రరీ బుక్స్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. 
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పీడిక రాజన్న దొర, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆరి్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top