CM YS Jagan Review Meeting: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting On Revenue Earning Departments - Sakshi

 ఆదాయార్జనశాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు అన్నారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని అధికారులు వివరించారు. డిసెంబర్‌-2022 వరకూ జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం. ఏపీలో వసూళ్లు 26.2 శాతం. తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్‌(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు.

జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ ఆదాయాలను కలిపిచూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని, దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా అధికారులు వెల్లడించారు.

గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని, విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. డేటా అనలిటిక్స్‌ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయన్న అధికారులు.. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామని తెలిపారు.

టాక్స్‌ అసెస్మెంట్‌ను ఆటోమేటిక్‌ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామని, డివిజన్‌ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్న సీఎం జగన్‌, తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. గనులు-ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరు శాతం చేరుకున్నామని అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్ల ఆర్జన. నిర్దేశించుకున్న రూ.5వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని, ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
చదవండి: ‘లోకేష్‌ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’

రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా రూ. 3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి... పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని అధికారుల వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(ఎక్సైజ్‌ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, అటవీపర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గనులు భూగర్భశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, రవాణాశాఖ కమిషనర్‌ పి ఎస్‌ ఆర్‌ ఆంజనేయలు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఎం గిరిజా శంకర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఏపి అటవీ అభివృద్ధి సంస్ధ సీజీఎం ఎం రేవతి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ రామకృష్ణ, ఏపీ స్టేట్‌‌ బివరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి వాసుదేవరెడ్డి, గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top