వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు

CM YS Jagan Orders For Skill Development Colleges As Rapid Speed In AP - Sakshi

భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలి

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి పనులు త్వరగా మొదలు పెట్టాలి

హై ఎండ్‌ స్కిల్స్,ఏసీ, ప్లంబింగ్,భవన నిర్మాణ పనులపై యువతకు శిక్షణ ఇవ్వాలి

అగ్రి యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపై కూడా శిక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

► ఆర్థిక శాఖ అధికారులతో కూర్చొని కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలి. పనులు త్వరగా మొదలు పెట్టాలి. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపై యువతకు శిక్షణ ఇవ్వాలి.
► హై ఎండ్‌ స్కిల్స్‌తో పాటు ప్రతి కాలేజీలో ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపై  శిక్షణ ఇవ్వాలి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్ధిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయి. 

 నైపుణ్యాభివృద్ధి కాలేజీలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి, అధికారులు 

20 చోట్ల స్థలాల గుర్తింపు
► కాలేజీల కోసం ఇప్పటి వరకు దాదాపు 20 చోట్ల స్థలాలను గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా ఆ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కాలేజీల్లో వివిధ కోర్సులకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అధికారులు ఇంకా ఏం చెప్పారంటే..
► ఫినిషింగ్‌ స్కిల్‌ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. మొత్తం 162కిపైగా కోర్సులు ఉంటాయి. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయి. 
► పరిశ్రమల అవసరాలపై సర్వే. ఆ సర్వే ప్రకారం కోర్సులు నిర్ణయించాం. పాఠ్య ప్రణాళిక తయారీలో సింగపూర్‌ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్‌ హాల్‌ లారెన్‌స్టెన్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ అప్‌లైడ్‌ సైన్సెస్‌), డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యాన్ని తీసుకున్నాం.
► మరో 23 ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎంఓయూలకు సిద్ధమయ్యాం. ఇంకో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయి. ల్యాబ్‌ ఏర్పాట్లు, పాఠ్య ప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నాం. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బయోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయి. 
► సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్‌ సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top