పర్యాటకానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌.. ప్రపంచాన్ని పిలుద్దాం

CM YS Jagan Mandate to officials for Andhra Pradesh Tourism development - Sakshi

రూ.2,868 కోట్ల పెట్టుబడితో పలు ప్రాజెక్టులు.. దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు..విశాఖలో లండన్‌ ఐ తరహా నిర్మాణానికి ప్లాన్‌

నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోండి 

పర్యాటక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం    

రాష్ట్రానికి ఈ చివర అనంతపురం జిల్లాలో లేపాక్షి మొదలు.. ఆ చివర శ్రీకాకుళం జిల్లాలోని మహేంద్రగిరుల వరకు కనువిందు చేసే అందాలు ఎన్నెన్నో. నల్లమల సౌందర్యం మధ్య కొలువైన శ్రీశైల మల్లన్న, శేషాచలంపై వెలసిన వెంకన్న, కనుచూపు తిప్పుకోలేనంతగా కట్టిపడేసే పాపి కొండలు, కేరళను కనుల ముందు సాక్షాత్కరింపచేసే కోనసీమ, ఊటీని తలదన్నేలా అరకు.. కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్ల సవ్వడి చెంత వెలసిన ఎన్నో క్షేత్రాలు, అపురూప దృశ్యాలకు నిలయం మన ఆంధ్రప్రదేశ్‌. ఈ అందాలను కనులారా వీక్షించాలే తప్ప వర్ణించలేం..

సాక్షి, అమరావతి: చారిత్రక సంపద, ప్రకృతి రమణీయత, అతి పొడవైన సముద్ర తీరానికి నెలవైన ఆంధ్రప్రదేశ్‌.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు సంతరించుకుంటోంది. రాష్ట్రంలో రూ.2,868.60 కోట్ల మేర పెట్టుబడులతో పలు భారీ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే హోటళ్లలో కొత్తగా 1,564 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్ర స్థాయి పెరుగుతుందని చెప్పారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారని, ప్రత్యక్షంగా..  పరోక్షంగా దీనిపై ఆధారపడే వారికి మెరుగైన అవకాశాలు వస్తాయని అన్నారు.

తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకు రావడంపై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

కొత్త ప్రాజెక్టులు ఇలా..
► విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు.
► విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌.
► తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్‌.
► విశాఖపట్నంలో టన్నెల్‌ ఆక్వేరియం, స్కై టవర్‌ నిర్మాణం.
► విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌.
► అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top