‘వంశధార’పై తుది తీర్పు అమలు చేయండి

CM YS Jagan letter to Gajendrasingh Shekhawat Vamsadhara river water - Sakshi

వీడబ్ల్యూడీటీ ఆదేశాలను పాటిస్తూ తక్షణమే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

నేరడి బ్యారేజీ ఫలాల కోసం శ్రీకాకుళం జిల్లా రైతుల ఎదురుచూపులు

కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్‌ తుది తీర్పును అమలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా మరోసారి లేఖ రాశారు. ‘వంశధార నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు పంపిణీ చేస్తూ వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌) నాలుగేళ్ల క్రితం 2017 సెప్టెంబర్‌ 13న తీర్పు ఇచ్చింది. 2021 జూన్‌ 21న తుది తీర్పు కూడా వెలువడింది. ఈ అవార్డు ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా? నేరడి బ్యారేజీ నిర్మితమవుతుందా..? వంశధార జలాలతో తమ పొలాలు ఎప్పుడెప్పుడు సస్యశ్యామలమవుతాయా..? అని అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

నేరడి బ్యారేజీ నిర్మాణం కాకపోవడం వల్ల ఏటా వంశధార జలాలు వృథాగా కడలిపాలవుతున్నాయి. దయచేసి వీడబ్ల్యూడీటీ అవార్డును తక్షణమే అమలు చేసేలా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయండి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించండి’ అని లేఖలో సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య వంశధార జలాల వివాదాన్ని పరిష్కరిస్తూ వీడబ్ల్యూడీటీ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ 2019 జూన్‌ 27న షెకావత్‌కు సీఎం జగన్‌ గతంలో లేఖ రాశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) చట్టం–1956 సెక్షన్‌–6(1) ప్రకారం వీడబ్ల్యూడీటీ తుది తీర్పు అమలుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరుతూ మంగళవారం మరోసారి లేఖ రాశారు. 

సీఎం జగన్‌ లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
వంశధార జల వివాదాన్ని పరిష్కరిస్తూ వీడబ్ల్యూడీటీ తుది తీర్పును 2021 జూన్‌ 23న కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. వంశధారపై నేరడి బ్యారేజీని నిర్మించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తుది తీర్పు క్లాజ్‌–4 ద్వారా వీడబ్ల్యూడీటీ అనుమతి ఇచ్చింది. తుది తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన రోజు నుంచి ఏడాదిలోగా నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా సర్కార్‌ సేకరించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించాలని క్లాజ్‌–8 ద్వారా వీడబ్ల్యూడీటీ ఆదేశించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన రోజు నుంచి మూడు నెలల్లోగా తీర్పు అమలును పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు నామినేట్‌ చేసిన వారితోపాటు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి క్లాజ్‌–10 ద్వారా వీడబ్ల్యూడీటీ దిశానిర్దేశం చేసింది. పర్యవేక్షణ కమిటీ నిర్ణయాలు, మార్గదర్శకాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే  పరిష్కరించడానికి సింగిల్‌ మెంబర్‌ రివ్యూ అథారిటీని ఏర్పాటు చేయాలని క్లాజ్‌–10(ఏ) ద్వారా కేంద్రాన్ని వీడబ్ల్యూడీటీ ఆదేశించింది. రివ్యూ అథారిటీగా కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. రివ్యూ అథారిటీ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు కట్టుబడాలి.

శ్రీకాకుళం రైతులకు ఫలాలను అందించాలి..
వీడబ్ల్యూడీటీ తీర్పు వెలువడి నాలుగేళ్లు పూర్తయింది. తుది తీర్పు కూడా వచ్చింది. కానీ ఇప్పటిదాకా వీడబ్ల్యూడీటీ తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు.  అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రైతులకు నేరడి బ్యారేజీ ఫలాలను అందజేయడానికి వీలుగా తక్షణమే సెక్షన్‌–6(1) ప్రకారం వీడబ్ల్యూడీటీ తుది తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరుతున్నాం. తుది తీర్పు అమలు తీరును పరిశీలించేందుకు పర్యవేక్షణ కమిటీ, సింగిల్‌ మెంబర్‌ రివ్యూ అథారిటీని కూడా నియమించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top