సమన్యాయం కోసమే వికేంద్రీకరణ

CM YS Jagan Comments at 74th Independence Day Celebrations - Sakshi

త్వరలోనే కొత్త రాజధానులకు శంకుస్థాపన

74వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌

ప్రత్యేక హోదా సాధనకు కట్టుబడి ఉన్నాం

2022 నాటికి పోలవరం పూర్తి

ఈ ఏడాది 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ఇంగ్లిష్‌ విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేస్తున్నాం

అక్టోబర్‌ 2 నుంచి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలకు శ్రీకారం

రూపం మార్చుకున్న అంటరానితనం
ఆర్టికల్‌ 17 ప్రకారం అంటరానితనం నేరం. అయినా విద్యాపరంగా అంటరానితనం పాటించాల్సిందే అన్నట్లుగా కొందరి వాదనలు ఉంటున్నాయి. మా పిల్లలు, మా మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలి. పేద పిల్లలు మాత్రం చదవడానికి వీల్లేదు అన్న వాదనలు చూస్తే రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తోంది. ఇది ధర్మమేనా అని ప్రశ్నించుకోవాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందేవిధంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా త్వరలోనే విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, భవిష్యత్తులో మరెన్నడూ అటువంటి గాయాలు తగలకుండా జాగ్రత్త పడాలన్నా పరిపాలన వికేంద్రీకరణే సరైన మార్గమని, ఇందుకోసమే మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామన్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను విజయవాడలో శనివారం ఘనంగా నిర్వహించారు.

జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించిన అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంటాం. కేంద్రంలోని ప్రభుత్వానికి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ ఉంది. మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదాను కచ్చితంగా సాధించాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నాం. హోదా ఇచ్చేదాకా కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉంటాం.

2022 నాటికి పోలవరం పూర్తి
– సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులలోనూ పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యతా ప్రాజెక్టులు.. వంశధార ఫేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌–1, అవుకు టన్నెల్‌–2, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. మన నీటి ప్రయోజనాల విషయంలో రాజీలేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీని ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం పది కాలాలు పదిలంగా ఉండేలా కొత్తగా 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తాం.

చదువే నిజమైన ఆస్తి
– తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లిష్‌ మీడియంను ఒక హక్కుగా అమలు చేస్తున్నాం. చదువే నిజమైన ఆస్తి, చదువే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చాం. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్‌ సంస్థల మీద కొరడా ఝళిపించేందుకు రెండు కమిషన్లు.. తల్లిదండ్రులకు, పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

పారిశ్రామిక పురోగతి
– రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగాన్ని పెంచేలా ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలకు దాదాపు రూ.1,200 కోట్ల ప్రోత్సాహకాలను, గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను చెల్లించాం. కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్నాం. వైఎస్సార్‌ వన్‌ విధానంలో రాష్ట్రంలో 10 రకాల కీలక సేవల్ని ప్రభుత్వం తరపున సమన్వయం చేస్తున్నాం. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను రిజర్వ్‌ చేసిన మన ప్రభుత్వం.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా చదువులకు మెరుగులు దిద్ది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ అక్టోబరు 2వ తారీఖున ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం.

వారందరికీ సెల్యూట్‌..
– ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి త్యాగం చేసిన మహానుభావులను, వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటున్నాం. అదే పద్ధతిలో కోవిడ్‌ మహమ్మారి నుంచి మనల్ని కాపాడ్డానికి నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న వారందరికీ ఈ సందర్భంగా అందరం సెల్యూట్‌ చేద్దాం. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా.

అవి ఎన్నికల పథకాలు కావు
– రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఈరోజు చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలాలు, ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాతే వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు. ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మంచి మనసుతో అమలు చేస్తున్న పథకాలు. ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలి. మీ అందరి దీవెనలు ఉండాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top