
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెట్టుబడులకు ఏపీ సులభమైనదని పేర్కొన్నారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023- కర్టెన్ రైజర్’ పేరుతో నిర్వహించిన సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
ఏపీలో అపార వనరులు ఉన్నాయని, పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని సీఎం జగన్ పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో మినరల్స్‌కు కొదవ లేదని తెలిపారు. సోలార్, విండ్ ఎనర్జీలో ఏపీలో అపార అవకాశాలున్నాయని, పరిశ్రమలకు అవసరమైన నీరు, మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలకు ఎలాంటి అవసరాలున్నా ఒక్క ఫోన్‌కాల్‌తో స్పందిస్తామని సీఎం తెలిపారు.
సీఎం జగన్ ప్రసంగం పూర్తిగా ఆయన మాటల్లో.. ‘ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రం గురించి సహజంగా పొగుడుతూ మాట్లాడతారు. అయితే అంతకంటే ముందు అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, సీఐఐ సదరన్ రీజయన్ చైర్‌పర్సన్ సుచిత్రా ఎల్లా వంటి పారిశ్రామిక ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గురించి సమగ్ర వివరాలతో వీడియో కూడా ప్రదర్శించాం.
ఒక రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారం చేయాలి అన్న అంశాలకు సంబంధించి నేను కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తాను. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుకూలతలు ఏమిటి ? అన్నది ఇప్పటికే చూపించడం జరిగింది. ఏపీలో 974 కిలోమీటర్ల విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఇది దేశంలోనే ఏపీని అత్యంత పొడవైన తీర ప్రాంతమున్న రెండో రాష్ట్రంగా నిలబెట్టింది. ఈ తీర ప్రాంతం పొడవునా నాలుగు ప్రాంతాల్లో 6 పోర్టులలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరో 4 పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ.. 6 విమానాశ్రయాలు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి.
48 రకాల ఖనిజాలకు ఏపీ నిలయం
దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 3 వస్తున్నాయి. వైజాగ్ – చెన్నై, చెన్నై – బెంగుళూరు, హైదాబాద్ – బెంగుళూరు కారిడార్‌లు ఏపీలో వస్తున్నాయి. రాష్ట్రంలో 80 శాతానికి పైగా జిల్లాలను ఈ మూడు కారిడార్లు కవర్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 48 రకాల ఖనిజాలకు నిలయంగా ఉంది. వివిధ రకాల ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు ఇవి ఉపయుక్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన అంశాలు కాగా... పరిపాలనపరమైన విషయాల్లో కూడా ఏపీ మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది.
ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం
ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ వేదిక సాక్షిగా నేను ఆనందంగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. 2021–22లో 11.43 శాతం గ్రోత్ రేటుతో ఏపీ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా గడిచిన మూడేళ్లుగా ఏపీ స్ధిరంగా దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో నిల్చింది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే మేం గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. దీని ద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత సానుకూలంగా ఉందన్నది స్పష్టమవుతుంది.
రాష్ట్రంలో అనేక క్లస్టర్లు
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు(పోర్ట్ లెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ ఎనర్షియా అవార్డు 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) అవార్డులు వచ్చాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తాయి. రాష్ట్రంలో అనేక ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్, టెక్ట్స్‌టైల్ పార్కులు, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్దంగా ఉన్నాయి.
మీరు ఏపీకి రండి..
ఆంధ్రప్రదేశ్‌ను మన రాష్ట్రంగా భావించండి. వరుసగా మూడేళ్లు పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో మొదటి స్ధానంలో నిలబడ్డాం. ప్రత్యేకంగా పారిశ్రామిక ప్రతినిధులు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ నిర్ధారణలో భాగస్వామ్యులుగా ఉన్నారు. అలాంటి వాటి ఫీడ్ బ్యాక్ నుంచి ఈ ర్యాంకులు ఇస్తున్నారు. ఇంతకముందే పారిశ్రామిక ప్రతినిధులు ఏపీ గురించి ఘనంగా చెప్పారు. అది చాలా ముఖ్యమైన అంశం.
త్వరగా అనుమతులు పొందండి.
ప్రధానంగా పరిశ్రమలు అనుమతులు విషయంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమల్లో ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. వేగవంతంగా అనుమతులు మంజూరు చేయడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉంది. పరిశ్రమలకు అవసరమైన భూమి, కరెంటు, నీళ్లు విషయంలో దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే తక్కువగా సరసమైన ధరలకే అందిస్తున్నాం.
రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీకి పుష్కలమైన వనరులు ఉన్నాయి. 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. ఇప్పటికే 14,680 మెగావాట్లకు సంబంధించి ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయి. ఈ రంగంలో ఇంకా పెట్టుబడులకు అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏపీ గ్రీన్ ఎనర్జీలో కీలకపాత్ర పోషించబోతుంది. మీ అందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాం.
పరిశ్రమల ఏర్పాటులో మీకు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించబోతున్నామని హామీ ఇస్తున్నాం. మరో హామీ కూడా ఇస్తున్నాం. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌక్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాం. అందుకే మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నాం. ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. మరలా మనం అందరం వైజాగ్‌లో కలుసుకుందాం’ అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సమావేశంలో వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి
పరిశ్రమల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమని సీఐఐ సదరన్ రీజయన్ చైర్‌పర్సన్ సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సింగిల్ డెస్క్ క్లియరెన్స్ ఉండటం సంతోషకరమన్నారు. ‘వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో ఏపీకి బంగారం లాంటి అవకాశాలు ఉన్నాయి. దివంగత వైఎస్సార్‌లాగా సీఎం జగన్ కూడా విజన్ ఉన్న నాయకుడు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సీఐఐ ముందుంటుంది. పరిశ్రమల ఏర్పాట్లకు సంబంధించి సీఎం జగన్ చూపిస్తున్న చొరవకు సీఐఐ తరపున కృతజ్ఞతలు’ అని ఆమె పేర్కొన్నారు.
‘ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్. ఎనర్జీ, సోలార్ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలున్నాయి. ఓడరేవులతో భారీ ఎగుమతులకు అవకాశముంది. ఏపీలో సోలార్ ప్యానెల్స్ తయారీకి కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. పరిశ్రమలుపెట్టడానికి సీఎం జగన్ చూపుతున్న చొరవ ప్రశంసనీయం’
-అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా