ఫ్యామిలీ డాక్టర్‌లా క్యాటిల్‌ డాక్టర్‌  | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ డాక్టర్‌లా క్యాటిల్‌ డాక్టర్‌ 

Published Wed, Sep 28 2022 3:48 AM

CM Jagan Says Comprehensive medical tests for cattle in villages - Sakshi

గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్‌ హెల్త్‌ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్‌ డాక్టర్‌ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్‌గా కార్యాచరణ రూపొందించాలి.     
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్‌ స్థాయిలో స్టాఫింగ్‌ ప్యాట్రన్‌ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్‌ చేయాలన్నారు.

వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. 

సేంద్రీయ పాల ఉత్పత్తులు 
పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్‌ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి.

ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్‌ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి.  

భావి తరాల కోసం.. 
పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి.

ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్‌ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో  గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. 

అక్టోబర్‌లో పశువుల బీమా పథకం 
పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి  అక్టోబర్‌ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్‌ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.  

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం 
పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్‌ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి.

బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి.  

‘లంపీ స్కిన్‌’పై జాగ్రత్త
తాజాగా పశువుల్లో లంపీ స్కిన్‌ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. 

సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి 
పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్‌సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి.

అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్‌గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి.  

Advertisement
 
Advertisement
 
Advertisement