సడలని పట్టు! విభజన పెండింగ్‌ అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం జగన్‌

CM Jagan discussed AP Division pending issues with PM Narendra Modi - Sakshi

రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చండి..

పోలవరం పెండింగ్‌ నిధులివ్వడంతోపాటు సవరించిన అంచనా వ్యయాలను ఆమోదించాలి

తెలంగాణ నుంచి రూ.6,886 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇప్పించాలి 

గత సర్కారు తప్పిదాలకు రుణ పరిమితిలో ఆంక్షలు సరికాదు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవశ్యం.. సానుకూల నిర్ణయం తీసుకోండి

కడప సీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి 

విశాఖ మెట్రో రైలు డీపీఆర్‌ ఇప్పటికే అందజేశాం.. సహకారం అందించండి 

మరో 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయండి

రాష్ట్ర అంశాలపై దాదాపు గంట పాటు ప్రధాని మోదీతో సీఎం జగన్‌ చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచినా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రధాని దృష్టికి తెచ్చారు.

అపరిష్కృత అంశాలపై గతంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పలుమార్లు సమావేశమై కొంత పురోగతి సాధించినా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో సమావేశమయ్యారు.

సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వివరించారు. 

ఆర్థ్ధిక ఆంక్షలపై జోక్యం చేసుకోండి.. 
గత సర్కారు పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను ఇప్పుడు సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణ పరిమితిపై ఆంక్షలు విధిస్తోందని, కేటాయించిన రుణ పరిమితిలో కోతలు విధిస్తోందని ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని దృష్టికి తెచ్చారు. గత సర్కారు చేసిన తప్పిదాలకు ఇప్పుడు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిల అంశాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించారు. రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తం రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.  

పోలవరానికి నిధులిచ్చి సహకరించండి.. 
ప్రధానితో భేటీలో ప్రధానంగా పోలవరానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ నిధులు, సవరించిన అంచనా వ్యయాల ఖరారు, నిర్వాసితులకు చెల్లింపులు లాంటి అంశాలను సీఎం జగన్‌ ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్లను రెండేళ్లుగా కేంద్రం చెల్లించలేదని, ఈ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానికి గుర్తు చేస్తూ దీన్ని ఖరారు చేసి త్వరగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి కాంపొనెంట్‌ను విడిగా కాకుండా ప్రాజెక్టులో భాగంగానే చూడాలని కోరారు. నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా పరిగణించడంతో బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల నిర్మాణంలో జాప్యం కావడంతోపాటు వ్యయం కూడా పెరుగుతోందని ప్రధానికి వివరించారు.

ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వారీగా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లిస్తే చాలావరకు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు రూ.10,485.38 కోట్లు అవసరమని, అడ్‌హాక్‌గా నిధులు మంజూరు చేస్తే పనులు వేగంగా కొనసాగుతాయని వివరించారు. ఈ నిధులను  మంజూరు చేస్తే భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు.

ప్రధాని సానుకూలం.. సీఎం ట్వీట్‌
విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించాం. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు పలు పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని కోరటంపై ప్రధాని సానుకూలంగా స్పందించారు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ బకాయిలు.. హోదా.. విశాఖ మెట్రో
తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ జెన్‌కోకు ఈ బకాయిల వసూలు అత్యవసరమన్నారు. జాతీయ ఆహార భ­ద్రతా చట్టం నిబంధనలు హేతుబద్ధంగా లేకపోవడంతో రాష్ట్రా­నికి తీ­వ్ర నష్టం వాటిల్లుతోందని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో అ­ర్హత ఉన్నప్పటికీ 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రేషన్‌ సరుకులను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని చెప్పారు. ఇందుకోసం రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నెలకు సుమారు 3 లక్షల టన్నుల రేషన్‌ బియ్యం నిల్వలు కేంద్రం వద్ద మిగిలిపో­తున్నాయని, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపచేసినట్లు అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అంశాలతో నీతి ఆయోగ్‌ కూడా ఏకీభవించి కేంద్రానికి సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.

► రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌ ప్రధానిని కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యమన్నారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.  

► కడపలో నిర్మించనున్న స్టీల్‌ ప్లాంట్‌కు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచేలా ఏపీఎండీసీకి గ­నులు కేటాయించాలని సీఎం కోరారు. 

► రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య 26కు పెరిగిన నేపథ్యంలో అదనంగా మెడికల్‌ కాలేజీలను మంజూరు చేయాలని సీఎం కోరారు. కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 3 మెడికల్‌ కాలేజీలతో కలిపి 14 మాత్రమే ఉన్నందున మిగిలిన 12 జిల్లాలకు కూడా వెంటనే వైద్య కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నట్లు తెలిపారు.

► విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top