సాక్షి, చిత్తూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు. కుప్పం నియోజకవర్గంలో రైతులకు రక్షణ కరువైంది. కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లిలో ఘటన జరిగింది. మృతుడు రైతు కిట్టప్పగా గుర్తించారు. రాగి పంటకు కాపలా ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు దాడి చేయడంతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు దాడి నుంచి రైతులు ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాగా, బంగారుపాళెం మండలంలోని అటవీ సరిహద్దు గ్రామమైన టేకుమందలో సోమవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడిచేశాయి. పంటలను ధ్వంసం చేశాయి. మొగిలి దేవరకొండ సమీపంలోని కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు టేకుమంద గ్రామం మామిడి మానుకుంట మీదుగా రైతుల పొలాలపైకి వచ్చాయి.
గ్రామానికి చెందిన పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మకు చెందిన సుమారు 4 ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అదేవిధంగా అరటి చెట్లను విరిచి నేలపాలు చేశాయి. అప్పులు చేసి పంటలు సాగు చేసుకుంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.



