అనాథ శవాలకు ఆత్మ బంధువులు

Chinnodu Peddodu helping hand for Orphan corpses - Sakshi

ఎక్కడ మృతదేహం కనిపించినా వారికే పిలుపు

చిన్నోడు, పెద్దోడు రానిదే పోస్ట్‌మార్టానికి వెళ్లని మృతదేహాలు

కుళ్లిన, ఛిన్నాభిన్నమైన మృతదేహాలను వెలికితీసి.. ఖననం చేసేది వాళ్లే 

సాక్షి, నెల్లూరు/బారకాసు: నెల్లూరు నగర పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఛిద్రమైన తల.. కాళ్లు, చేతులు వేర్వేరుగా పడి ఉన్నాయి. చుట్టూ ఈగలు ముసురుతుండగా.. ఆ శవం దుర్వాసన వెదజల్లుతోంది. పోలీసులు సైతం ముక్కుమూసుకుని నిలబడగా.. పెద్దోడు, చిన్నోడు అనే వ్యక్తులు చకచకా వచ్చి శరీర భాగాలను సేకరించారు. వాటన్నిటినీ ఓ దుప్పట్లో కట్టుకుని వాహనంలోకి ఎక్కించారు.

అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఛిద్రమైన శవ భాగాలను శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరిపారు. కట్టె కాలుతుండగా ఎగిసిపడే చితి మంటలు.. వారి ఔదార్యానికి సలాం చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వేలాది మృతదేహాలకు పెద్దోడు, చిన్నోడు అసామాన్య సేవలందిస్తున్నారు.

రైలు బోగీలకు మంటలంటుకున్న వేళ
2011లో నెల్లూరు రైల్వేస్టేషన్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ బోగీల్లో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. చాలామంది ప్రయాణికులు అగ్నికీలల్లో చిక్కుకుని గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. ఆ సమయంలో చిన్నోడు, పెద్దో డు కృషి అంతా ఇంతా కాదు. వీరిద్దరి సహకారంతోనే మంటల్లో కాలిపోయిన వారి మృతదే హాలను బోగీల్లోంచి వెలికితీసి రక్త సంబంధీకు లకు అప్పగించారు. కరోనా విజృంభించిన సమ యంలోనూ పెద్దోడు, చిన్నోడు ప్రాణాలకు తెగించి మృతదేహాలకు అంత్యక్రియలు చేయించారు. 

ఇదీ పెద్దోడు కథ..
విశాఖపట్టణానికి చెందిన బత్తిన గురుమూర్తి (పెద్దోడు) 30 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా సొంతూరిని వదిలేసి నెల్లూరు చేరుకున్నాడు. ప్రధాన రైల్వేస్టేషన్‌లో ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకుని కడుపు నింపుకునేందుకు చేతనైన పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా.. ఓ రోజు రాత్రి రైలు పట్టాలపై శవం ఉందన్న సమాచారం రైల్వే పోలీసులకు అందింది. అర్ధరాత్రి వేళ శవాన్ని ఎవరు తీస్తారని ఎదురుచూస్తున్న సమయంలో వారికి గురుమూర్తి కనిపించాడు.

అతడిని నిద్రలేపిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చేందుకు రావాలని కోరారు. పెద్దోడు కాదనకుండా శవం ఉన్న ప్రాంతానికి వెళ్లి.. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం భాగాలను ఓ సంచిలో వేసుకుని చెక్కబండిపై నెట్టుకుంటూ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. దీంతో పోలీసులు గురుమూర్తికి రూ.300 ఇచ్చారు.

ఆ నగదుతో 4 రోజులపాటు కడుపునింపుకున్న పెద్దోడు మరోసారి కూడా అదే తరహాలో అనాథ మృతదేహాన్ని తరలించాడు. ఇలా మొదలైన ఆయన జీవన ప్రయాణం 30 ఏళ్లుగా అనాథ శవాలకు ఆత్మబంధువుగా.. పోలీసులకు సహాయకారిగా మారాడు. నెల్లూరు నగర పరిసరాల్లో ఎక్కడ ప్రమాదవశాత్తు లేదా ఇతరత్రా కారణాలతో ఎవరైనా మృతి చెందితే పోలీసుల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చేది పెద్దోడికే.

చిన్నోడు ఎవరంటే..
నెల్లూరులోని కొత్తూరుకు చెందిన సురేష్‌కుమార్‌ (చిన్నోడు) కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వచ్చేశాడు. ప్రధాన రైల్వేస్టేషన్‌ ఎదుట ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకున్నాడు. యాచిస్తూ కడుపు నింపుకునే సురేష్‌కు గురుమూర్తితో స్నేహం ఏర్పడింది.  అప్పటినుంచి ఎక్కడ మృతదేహం ఉన్నా పోలీసుల నుంచి పిలుపు రాగానే ఇద్దరూ కలసి వెళ్తున్నారు.

అలా చేయడంలోనే తృప్తి
అది మంచో చెడో మాకు తెలియదు. శవాలు కనిపిస్తే సాయం చేయాలనిపిస్తుంది. పోలీసులిచ్చే డబ్బు కోసం కాదు. మాకు అందులోనే తృప్తి ఉంటోంది కాబట్టే ఆ పనికి ఒప్పుకుని చేస్తున్నాం. 
– గురుమూర్తి (పెద్దోడు)

అప్పుడప్పుడూ బాధేస్తుంది
ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి పరిస్థితిని చూసి బాధ కలుగుతుంది. వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. కొన్నిసార్లు కుక్కలు సైతం పీక్కు తింటుంటాయి. కుళ్లి పోయిన శవాలనూ చూస్తుంటాం. ఇలాంటప్పుడు మాకు బాధ కలుగుతుంది.
– సురేష్‌కుమార్‌ (చిన్నోడు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top