అమ్మో.. చైనా యాప్‌లు.. పేర్లు మార్చుకుని ఏకంగా 57 శాతం!

China Apps taking Our personal information - Sakshi

వ్యక్తిగత గోప్యతకు భంగం 

57 శాతం అధిక సమాచారం కోరుతున్న యాప్‌లు 

నిషేధించినా మారుపేర్లతో చలామణి 

సాక్షి, అమరావతి: ‘చైనా దుకాణంలో దూరిన ఎద్దు..’ అనేది ఓ సామెత. అంటే పింగాణి సామగ్రి దుకాణంలో ఎద్దు దూరితే అది లోపలున్నా.. బయటకొచ్చినా.. దుకాణానికి నష్టమే. ఇక తాజాగా మన మొబైల్‌ ఫోన్‌లో చైనా యాప్‌ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొబైల్‌ ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకునే కొన్ని చైనా యాప్‌లు చాపకింద నీరులా మన వ్యక్తిగత సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం అటువంటి చైనా యాప్‌లను నిషేధిస్తున్నప్పటికీ పేర్లు మార్చుకుని మరీ చలామణిలోకి వచ్చేస్తున్నాయి. చైనా యాప్‌లు 57 శాతానికిపైగా అదనపు సమాచారాన్ని సేకరించి ఇతరులకు చేరవేస్తున్నాయని పుణెకు చెందిన ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఆర్కా కన్సల్టెన్సీ జనవరిలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది.  

సరిహద్దులు దాటుతున్న సమాచారం 
మొబైల్‌ యాప్‌ సంస్థలు అవసరానికి మించి వినియోగదారుల సమాచారాన్ని కోరుతున్నాయి. వినియోగదారులకు తగిన అవగాహన లేకపోవడంతో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే తొందర్లో ఆ సమాచారాన్ని ఫీడ్‌ చేస్తున్నారు. ప్రధానంగా కాంటాక్ట్‌ నంబర్లు, కెమెరా, మైక్రోఫోన్, సెన్సార్లు, లొకేషన్, టెక్టŠస్‌ మెస్సేజ్‌లు మొదలైన అంశాలతో అనుసంధానించమని అడుగుతున్నాయి. ఆ విధంగా యాప్‌ కంపెనీలు 57 శాతానికిపైగా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాయి. 90 శాతానికిపైగా యాప్‌లు అవసరం లేనప్పటికీ కెమెరా యాక్సెస్‌ కోరుతున్నాయి. వాటిలో వినోద, విద్య, ఇ–కామర్స్, న్యూస్, గేమింగ్‌ తదితర యాప్‌లున్నాయి. ఆ సమాచారాన్ని యాప్‌ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, సింగపూర్‌లతోపాటు గుర్తుతెలియని దేశాల్లోని సంస్థలకు విక్రయిస్తున్నాయి.

ఆయా దేశాల్లోని సంస్థలు ఆ సమాచారాన్ని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మార్కెట్‌ రీసెర్చ్‌ కోసం అంటూ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెబుతున్నాయి. ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తున్నారా అన్నదానిపై సందేహాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలీబాబా వంటి ప్రముఖ సంస్థ యాప్‌లను భారత్‌లో ఏకంగా 43 కోట్లమంది వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవడం గమనార్హం. అంటే ఏ స్థాయిలో భారతీయుల సమాచారాన్ని ఆ సంస్థ సేకరించిందో తెలుస్తోంది. వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుండటం సైబర్‌ నేరాలకు కూడా కారణమవుతోందని ఆర్కా కన్సల్టెన్సీ గుర్తించింది. డిజిటల్‌ పేమెంట్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి సైబర్‌ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు, హ్యాకింగ్‌లు పెరగడం దీనికి తార్కాణమని కూడా గుర్తుచేస్తున్నారు.  

పేరు మార్పుతో మళ్లీ.. 
కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చైనా యాప్‌లను నిషేధిస్తోంది. 2020 నుంచి 278  చైనా యాప్‌లను నిషేధించింది. వాటిలో టిక్‌టాక్, షేర్‌ ఇట్, వుయ్‌చాట్, లైకీ, బిగ్‌ లివ్, అలీ ఎక్స్‌ప్రెస్, అలీపే క్యాషియర్‌ మొదలైనవి ఉన్నాయి. భారత్‌లో ఆ యాప్‌లను బ్యాన్‌ చేయాలని గూగుల్‌ ప్లే స్టోర్‌ను కేంద్రం ఆదేశించింది కూడా. కానీ ఆ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ దేశంలో అందుబాటులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. వాటిలో ప్రముఖ కంపెనీలు అలీబాబా, టెన్సెంట్, నెట్‌ఈజ్‌ వంటి ప్రముఖ సంస్థలకు చెందినవి కూడా ఉండటం గమనార్హం. దీనిపై వివరాల కోసం ఈ–మెయిల్‌ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సంస్థలు స్పందించలేదని ఆర్కా కన్సల్టెన్సీ పేర్కొంది.  
అప్రమత్తతే పరిష్కారం 
యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. మనకు అవసరమైనమేరకే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందుకు ముందు ఆ కంపెనీలు అడిగే సమాచారాన్ని పూర్తిగా చదవాలి. సమాచారం పెద్దగా ఉంది కదా అని చదవకుండా యాక్సెస్‌ ఇవ్వొద్దు. అవసరమైనంత వరకే సమాచారం ఇవ్వండి. యాప్‌లు ప్రతి వారం, పదిరోజులకు ఒకసారి అప్‌డేట్‌ అడుగుతుంటాయి. అప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఓకే చేయండి. ఇక బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్ధిక వ్యవహారాల అంశాలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారం లీకైందని భావించినా, తాము సైబర్‌ నేరాల బారిన పడ్డామని తెలిసినా వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 
– రాధిక, ఎస్పీ, సైబర్‌ క్రైం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top