చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై వైఎస్ జగన్ నిలదీతపై సమాధానం కరువు
అమరావతిలో చంద్రబాబు అవినీతిపై సూటి ప్రశ్నలు.. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా టీడీపీ కూటమి నేతల అడ్డగోలు వాదనలు
కాగ్ వంటి కేంద్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు చూపి ప్రశ్నించినా గప్‌చుప్
హత్యా రాజకీయాలపై, అమరావతిలో లూటీపై, హామీలు ఎగ్గొట్టడంపై నో కామెంట్.. వ్యక్తిత్వ హననం చేస్తూ చంద్రబాబు డైవర్షన్ రాజకీయం
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, మరోవైపు కీలక రంగాలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలేవీ అమలు చేయకుండానే, చేసేశామని.. రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో డప్పు కొట్టుకుంటోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ రంగాల వారీగా ఆధారాలు చూపిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ నిలదీశారు.
ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు చంద్రబాబు కానీ, ఆయన మంత్రులు కానీ స్పష్టంగా సమాధానం ఇచ్చిన పాపాన పోలేదు. అడ్డగోలు వాదనతో దూషిస్తూ, దుర్భాషలాడుతూ ఎదురు దాడికి దిగారు. మొదటి నుంచీ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు ఆద్యులెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారికి హైదరాబాద్‌లో ఇదే టీడీపీ కార్యాలయంలో షెల్టర్ ఇచ్చిందెవరన్న ప్రశ్నపై నోరు విప్పితే ఒట్టు. రాజధానిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఎందుకు వెచ్చిస్తున్నారో సమాధానం చెప్పలేదు. ఇంటీరియర్, తదితర సౌకర్యాలను కలిపితే చదరపు అడుగు రూ.30 వేలు దాటిపోవచ్చు. అయినా కమీషన్ల కోసం సమర్థింపే కనిపిస్తోంది తప్ప.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నామనే భీతి ఇసుమంతైనా లేదు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. పీఆర్సీ లేదు.. నాలుగు డీఏలు లేవు. దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలున్నాయి. వీటన్నింటిపై చంద్రబాబు కూటమి నుంచి సమాధానమేలేదు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాలు చూపి ప్రశ్నించినా స్పందనే ఉండదు. పైగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ డైవర్షన్ రాజకీయం చేయడం మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో తీవ్ర చర్చే లేవనెత్తాయి. ఈ సందర్భంగా వాటిలో కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
బాబూ.. సమాధానం చెప్పండి
⇒ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తుండటం నిజం కాదా?
⇒ మీ స్కామ్‌ల కోసం చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తుండటం నిజం కాదా?
⇒ స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్ట్‌లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తుండటం వాస్తవం కాదా?
⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటక పోవడం
నిజం కాదా?
⇒ దేశంలో హైవేల నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతుంటే.. అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు?
⇒ ఈ లెక్కన అమరావతి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అవుతుంది? అలా అంటూనే రాజధాని కోసం రూ.47,387 కోట్ల అప్పులు చేయడం, బడ్జెట్ నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపించడం నిజం కాదా? ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లు ఖర్చు చేస్తుండటం నిజం కాదా?
⇒ రాజధానిలో మీ (చంద్రబాబు) మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణ, అశ్వినీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకు రోడ్ల పక్కన, సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు ఇవ్వడం నిజం కాదా?
⇒ ఈ విషయాలపై నిలదీస్తే, ఇందుకు ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ను సూచిస్తే మీకు (చంద్రబాబు) బీపీ పెరిగి మీ మంత్రులతో బూతులు తిట్టిస్తుండటం వాస్తవం కాదా?
⇒ కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లుతోందెవరు?
⇒ మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉంచి కాపాడలేదా?
⇒ మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేనూ చూస్తా’ అని మీరు (చంద్రబాబు) బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా?
⇒ మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?
⇒ మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతుండటం నిజం కాదా? మీ (చంద్రబాబు) లాయర్ సిద్దార్థ లూథ్రానే దస్తగిరి తరఫున కూడా లాయర్‌గా వాదిస్తుండటం వాస్తవం కాదా?
⇒ చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా?
⇒ ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్‌మెన్‌ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా?
⇒ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్‌తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా?
⇒ సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొన్నదెవరు?
⇒ వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతుండటం నిజం కాదా?
⇒ మల్లెల బాబ్జి ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్‌లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు?
⇒ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్‌ను చంపిందెవరు?
⇒ 2015లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధించింది మీరు కాదా?
⇒ మీ కాంట్రాక్టర్లకు రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసిందెవరు?
⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసిందెవరు?
⇒ అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నది మీరు కాదా?
⇒ మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా చూస్తూ, ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నదెవరు?
⇒ 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఎంత మందికి ఇచ్చారు?
⇒ రైతులకు ఉచిత పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఎగ్గొట్టిందెవరు? ఆర్బీకేలు నిర్వీర్యం చేసిందెవరు? ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా పట్టించుకోనిదెవరు?
⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.9,728 కోట్లు ఇవ్వాలనడం నిజం కాదా? ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదెవరు?
⇒ రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్‌షిప్ కొనసాగుతుండటం నిజం కాదా?
⇒ మీకు (చంద్రబాబుకు) వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తుండటం వాస్తవం కాదా?
⇒ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగుతుండటం నిజం కాదా?
⇒ ఓ వైపు పొదుపు చర్యలు అంటూ చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడులు వేర్వేరుగా ప్రైవేట్ చాపర్‌లో తిరుగుతుండటం నిజం కాదా?


