
తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానన్న చంద్రబాబు హామీ ఉష్ కాకి అయిందని, 25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పైగా జగన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్టు చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు.
అభ్యర్థులు కష్టపడి చదివి, ఉద్యోగం సాధిస్తే చంద్రబాబు తన గొప్పగా భజన చేసుకుంటున్నారని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. మెరిట్ లిస్టులో ఉన్న కొందరికి ఉద్యోగాలు రాకపోవటానికి కారణం ఏంటి?అని ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానమే చెప్పటం లేదన్నారు. ఫలితంగా తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయని, జగన్ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను జగన్ హయాంలో వచ్చాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలతో కలిపితే ఆరు లక్షల మందికి అవకాశం కల్పించారని, అయినా జగన్ ప్రచారం చేసుకోలేదని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.
అయితే సీఎం చంద్రబాబు ఏమీ చేయకుండానే విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని, ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎ, ఐఆర్, పిఆర్సీ గురించి ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారని, పండుగలన్నీ వెళ్తున్నాయిగానీ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదుని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వాలంటీర్ల పనులను కూడా సచివాలయ సిబ్బందితో ఎందుకు చేయిస్తున్నారని చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. సెలవు రోజులు, రాత్రి సమయాల్లో కూడా పనులు చేయిస్తూ వేధిస్తున్నారని, ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దసరాలోపు ఉద్యోగులకు మేలు చేకూర్చకపోతే వారంతా రోడ్డెక్కటం ఖాయమని చంద్రశేఖరరెడ్డి హెచ్చిరించారు.