బాబ్బాబు.. కోతలు కాదు.. అంతరాయాలనండి! | Chandrababu Naidu Govt new drama on power cuts | Sakshi
Sakshi News home page

బాబ్బాబు.. కోతలు కాదు.. అంతరాయాలనండి!

May 29 2026 5:08 AM | Updated on May 29 2026 5:08 AM

Chandrababu Naidu Govt new drama on power cuts

విద్యుత్‌ కోతలపై చంద్రబాబు సర్కారు కొత్త పాట 

కోతలు లేవు.. అంతరాయాలంటున్న విద్యుత్‌ మంత్రి  

మంత్రి బాటలోనే జిల్లాల్లో అధికారుల ప్రకటనలు  

నిరంతర విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వం విఫలం  

చేతగానితనాన్ని ప్రకృతి మీదకు నెట్టేసే ప్రయత్నం

గాలివానలు, అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలి­పోతున్నాయి. విద్యుత్‌ వినియోగం పెరగడం వల్ల లోడ్‌ తట్టుకో­లేక ఫీడర్లు ట్రిప్‌ అవుతున్నాయి. కాబట్టే రాష్ట్రంలో విద్యుత్‌ సరఫ­రా­లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అంతేగాని విద్యుత్‌ కోతలు లేవు.     
- ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 

సబ్‌స్టేషన్‌లోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో లోపం ఏర్పడటంతో గ్రిడ్‌పై అధిక లోడ్‌ పడి, దాని ప్రభావం కారణంగా ఏలూరు పట్టణం, పరిసరప్రాంతాల్లో రాత్రి సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి విద్యుత్‌ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.  
-ఏపీ ఈపీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సాల్మన్‌రాజు  

ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాలన్నీ ఒకేసారి వినియోగిస్తే ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్‌ పెరిగి, అది కాలిపోయి రాత్రి అంతా కరెంటు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కావున విద్యుత్‌ వినియోగం తగ్గించుకుని మాకు సహకరించండి. ఎక్కడైనా విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా కొంచెం ఓర్పు, సహనంతో ఉండాలని కోరుతున్నాం.     
- వినియోగదారులకు విద్యుత్‌ శాఖ చేసిన విజ్ఞప్తి  

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్‌ కోతలకు ఆ శాఖ మంత్రి, అధికారులు చెబుతున్న కారణాలివి. విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా అందించలేక ప్రకృతి మీద నెపం నెట్టి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రకటనలివి. ఇలాంటి ప్రకటనలు విద్యుత్‌ శాఖ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.  

ట్రాన్స్‌ఫార్మర్లు తట్టుకోలేవంటూ కథలు..  
విద్యుత్‌ శాఖ మంత్రి, ఇంధన శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. నిజంగానే ట్రాన్స్‌ఫార్మర్లు ప్రస్తుత ఉష్ణోగ్రతలను తట్టుకోలేవా అని విద్యుత్‌ రంగ నిపుణులను అడిగితే 315 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు ఉన్నా నిస్సందేహంగా తట్టుకుంటుందని తెలిపారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లో కూలింగ్‌ సిస్టం ఉంటుంది. అంటే రేడియేటర్లు, ఫ్యాన్లు, ఆయిల్‌ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌ను చల్లబరిచే వ్యవస్థ అందులో ఉంటుంది. అంతేకాదు ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్‌ ఉష్ణోగ్రత  95 డిగ్రీల వరకు, వైండింగ్‌ 120 డిగ్రీల వరకు వేడిని తట్టుకుంటాయి. మరి ఇంతటి సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌ ఎక్కువై కాలిపోవడం ఏమిటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌కు తగ్గట్టుగానే దాని పరిధిలో విద్యుత్‌ సర్వీసులు ఉంటాయి. మొత్తం సర్వీసులు వినియోగించే విద్యుత్‌ లోడ్‌కు తగ్గట్టే ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఓవర్‌లోడ్‌ అయ్యే పరిస్థితి ఎందుకొస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే కేవలం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రభుత్వం చెబుతున్న సాకులని నిపుణులు తేల్చి చెబుతున్నారు.  

అంచనాల్లోనే విఫలమై..అనధికార కోతలు  
రాష్ట్రంలో వేసవి గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 280 మిలియన్‌ యూనిట్లు ఉండవచ్చని ఇంధన శాఖ వేసవి ప్రారంభానికి ముందే అంచనా వేసింది. కానీ ఇటీవల రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 288 మిలియన్‌ యూనిట్ల వరకు వెళ్లింది. అంచనాల్లోనే విద్యుత్‌ శాఖ విఫలమైందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేసే పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం లేదు. దీంతో ప్రజలకు నిరంతరం విద్యుత్‌ అందించలేకపోతున్నామనే విషయాన్ని కప్పిపుచ్చడానికి కొన్ని రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్‌ డిమాండ్‌తో లోడ్‌ పెరిగిపోయిందని చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి 280 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేసినప్పుడే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. పెరిగింది కూడా కేవలం 8 మిలియన్‌ యూనిట్లే. అది కూడా ఒకటి, రెండు రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో ఆ స్థాయిలో డిమాండ్‌ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్‌ (బుధవారం) 240 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. అంటే అంచనాకంటే చాలా తక్కువగానే వినియోగం ఉంది. అయినా కూడా విద్యుత్‌ సరఫరా చేయలేక కోతలు విధిస్తున్నారు. పట్టణాల్లోనే రోజుకు రెండు గంటలు కరెంటు తీసేస్తుండగా, గ్రామాల్లో వేళాపాళా లేకుండా అనధికా రికంగా విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లోను విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. అయినా మంత్రి మాత్రం అవి కోతలు కాదు.. అంతరాయాలు అంటూ పర్యాయపదాలు చెబుతూ కాలం గడపాలని చూస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement