ఇంధనానికి బంధనం.. కొరత లేదంటూనే కోత | Chandrababu Govt Political Drama With AP People On fuel crisis | Sakshi
Sakshi News home page

ఇంధనానికి బంధనం.. కొరత లేదంటూనే కోత

Apr 30 2026 5:35 AM | Updated on Apr 30 2026 5:35 AM

Chandrababu Govt Political Drama With AP People On fuel crisis

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న సర్కారు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. డీజిల్, పెట్రోల్‌ కొరత లేదంటూ బూటకపు ప్రచారం చేయడం తప్ప బంకులకు సరఫరాను మెరుగుపర్చట్లేదు. వారం గడిచినా ఇప్పటికీ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌పై పరిమితి కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలకు కేవలం రూ.200కు మించి పెట్రోల్‌ నింపడం లేదు. కార్లకు అయితే గరిష్టంగా 10–15 లీటర్లు, లారీలకు 50 లీటర్ల వరకే డీజిల్‌ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకసారి రెండు లీటర్ల డీజిల్‌ నింపుకుని వెళ్లొచ్చేలోగా అయిపోతోంది. మళ్లీ హడావుడిగా బంకుల దగ్గర పరుగెత్తాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ప్రయాణికులతో మార్గంమధ్యలో ఆగిపోవాల్సి వస్తోంది. ఆటోలను తోసుకెళ్లలేక ఖాళీ బాటిళ్లలో ఇంధనం నింపుకుని వద్దామంటే ప్రభుత్వ ఆదేశాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఖాళీ టిన్నులు, బాటిళ్లలో ఇంధనం నింపొద్దని చంద్రబాబు సర్కార్‌ జారీ చేసిన ప్రకటన బడుగుల జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అవసరానికి మించి ఇంధనం తీసుకుంటే ప్రజలను సైతం శిక్షిస్తామని బహిరంగంగా పోస్టర్లు వేయడం అరాచక పాలనకు అద్దం పడుతోంది.   

తనిఖీల పేరుతో బంకుల సీజ్‌ 
రాష్ట్రంలో ఇండెంట్‌కు, అవసరాలకు తగ్గట్టుగా బంకులకు ఇంధన సరఫరా జరగడం లేదు. దీంతో ప్రభుత్వం తనిఖీల పేరుతో పెట్రోల్‌ బంకుల యజమానులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. నో స్టాక్‌ బోర్డు­లు పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. పైగా తనిఖీల్లో స్టాకు లేన­ట్టు గుర్తిస్తే అక్కడ అక్రమంగా ఇంధనాన్ని దొడ్డిదారి పట్టించారంటూ బంకులను సీజ్‌ చేస్తోంది. సంక్షోభం సమయంలో ఇలా బంకులను సీజ్‌ చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారనే కనీసం విజ్ఞత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోంది. బంకుల య­జ­మా­నులు తమకు సాధారణ రోజుల్లో మాదిరి ఇంధనం రావడం లేదని ఎంత మెరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంధనం అయిపోతే బంకులదే బాద్యత అంటూ విచిత్ర వాదన తీసుకొచ్చి నిత్యం నరకం చూపిస్తోంది. చాలా బంకులకు రెగ్యులర్‌ వినియోగదారులుంటారు. వారంతా ఆయా బంకుల్లోనే తమ వాహనాలకు ఇంధనాన్ని నింపుతుంటారు.అలాంటి వారికి చా­లా బంకులు క్రెడిట్‌(అప్పు)పై ఇంధనం విక్రయిస్తుం­టాయి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ర­వా­ణా రంగం కుదేలైంది. డైలీ క్యాబ్‌ సర్వీసులు, దూర ప్రాంతాలకు సరుకులు చేరవేసే మినీ వ్యాన్లు అర్థంతరంగా రోడ్లపై ఆగిపోతున్నాయి. పెద్ద వాహనాలకు 100 లీటర్ల డీజిల్‌ పో­స్తా­రని ప్రకటించినా బంకుల్లో లభ్యత లేకపోవడంతో అరకొరగానే నింపుకోవాల్సి వస్తోంది. 

క్రెడిట్‌ ఎత్తేసిన కంపెనీలు 
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా దివాళ తీస్తోంది. అప్పులపై వడ్డీలు.. ఆ వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడంతోనే పరిపాలనను నెట్టుకొస్తోంది. ఫలితంగా సామాన్య పొదుపు సంఘాల క్రెడిట్‌ పరపతి ఎప్పుడో కుదేలైంది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు రంగంలోని బంకులకూ అది పాకింది. ప్రభుత్వ పనితీరును నిత్యం మదింపు చేసుకుంటున్న ఆయిల్‌ కంపెనీలు క్లిష్ట సమయంలో బంకులకు క్రెడిట్‌(అప్పు)ను నిలిపివేశాయి. ముందుగా చెల్లిస్తే తప్ప స్టాకును పంపించట్లేదు. ఒక్కసారిగా రూ.­లక్షల్లో నగదు సమకూర్చలేని స్థితిలో బంకుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రభు­త్వం తీసుకున్న అనాలోచిత, దోపిడీ విధా­నాల కారణంగా డబ్బులు కట్టినా ఏకంగా సరఫరాను కుదించేస్తున్నా­యి. రాజధాని ప్రాంతంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యనేత సాధారణ బంకుల నుంచి కమర్షియల్, బల్క్‌ డీజిల్‌ను తరలించాలని ఆదేశాలివ్వడంతో పరిస్థితి దిగజారిపోయింది. కమర్షియల్‌లో డీజిల్‌ రేటు రూ.153 ఉండటంతో ప్రభు­త్వం రిటైల్‌ రేటుకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్‌ను బంకుల నుంచి సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీని ఫలితంగా బల్క్‌ ఆర్డర్లకు డీజిల్‌ తరలించుకుపోవడంతో కొరత తీవ్రమైంది.  

రిటైల్‌ నుంచి కమర్షియల్‌కు దారి మళ్లింపు 
రాష్ట్రంలో సగటున రోజువారీగా 9 వేల కిలో లీటర్ల పెట్రో­ల్, 20వేల కిలో లీటర్ల డీజిల్‌ వినియోగం ఉంటుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి నేటివరకు దాదాపు లక్ష కిలో లీటర్ల డీజిల్‌ బ్యాక్‌ లాగ్‌ ఉంది. అంటే, ఇప్పటికిప్పుడు లక్ష కిలో లీటర్ల డీజిల్‌ అందుబాటులోకి వస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదు. మరుసటి రోజు నుంచి యథావిధిగా రోజుకు 20 వేల కిలో లీటర్ల డీజిల్‌ సరఫరా ఉండాల్సిందే. అయితే, చంద్రబాబు ప్రభు­త్వ నిర్వాకంతో ఒక్క రాజధాని ప్రాంతంలోనే 10 లక్షల లీటర్లకుపైగా రిటైల్‌ ఇంధనాన్ని కమర్షియల్‌లో వాడేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిటైల్‌ను కమర్షియల్‌లోకి దారి మళ్లించేశారు. ఏపీలో 100కు పైగా లారీలు, టిప్పర్లను ఆపరేట్‌ చేసే కంపెనీలు స్థానికంగానే మార్కెట్‌ కంటే రూ.10 అదనంగా చెల్లించి భారీస్థాయిలో ఇంధనం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్ర­జలకు చేరాల్సిన డీజిల్, పెట్రోల్‌ పక్కదారి పడుతోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement