విద్యార్థి'కి' మిత్ర ద్రోహం | Chandrababu Govt failure in implementing Vidyarthimitra | Sakshi
Sakshi News home page

విద్యార్థి'కి' మిత్ర ద్రోహం

May 24 2026 5:37 AM | Updated on May 24 2026 5:38 AM

Chandrababu Govt failure in implementing Vidyarthimitra

విద్యార్థి మిత్ర అమల్లో బాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం

విద్యా కానుక కిట్‌ పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయం

యూనిఫాం, షూ, బ్యాగ్‌ ఇవ్వలేమని ప్రకటన

యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలకు ముడి

ముడిసరుకు ధరలు.. రవాణాలో ఆటంకాలు అంటూ బూటకాలు

రెండేళ్లకే చేతులెత్తేసిన తండ్రీకొడుకులు

ఎన్ని ఆటంకాలు ఎదురైనా సకాలంలో అమలైన జగనన్న విద్యా కానుక

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇందుకు ఇరాన్‌–అమెరికా యుద్ధాన్ని సాకుగా చూపింది. జూన్‌ 12న బడులు తెరిచిన మొదటిరోజే వీటిని అందిస్తామని ప్రారంభంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకునేందుకు సాకులు వెదుకుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకు ధరలు పెరిగాయని, ముఖ్యంగా గ్యాస్‌ కొరత, క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభం, ఫైబర్‌ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉండడంతో క్రూడ్‌ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయని చెప్పింది. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని చెబుతోంది. ఇలా కుంటి సాకులతో కేవలం రెండేళ్లకే విద్యార్థి మిత్ర అమల్లో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చేతులెత్తేశారు.

జగన్‌ ప్రభుత్వం పుణ్యమాని ‘2024 జూన్‌’ హ్యాపీ
2024 జూన్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక కిట్‌ పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్రగా మార్చింది. అయితే  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ముందుగానే ఆర్డర్‌ పెట్టిన జగనన్న విద్యాకానుక కిట్లను కూటమి ప్రభుత్వం 2024 జూన్‌ నెలలోనే సకాలంలో పంపిణీ చేయగలిగింది. ఇది జగన్‌ ప్రభుత్వం క్రెడిట్‌ తప్ప, చంద్రబాబు ప్రభుత్వం గొప్పేమీ కాదు. 2025కు వచ్చేసరికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లకు కిట్లు సరఫరా చేయలేమని భీష్మించారు. దాంతో అధికారులు చొరవ తీసుకుని, సరఫరాదారులకు భరోసా ఇచ్చి కిట్లు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో జూన్‌ నెలలో ఇవ్వాల్సిన కిట్లు ఆగస్టు దాటినా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారు. 

కమీషన్ల కహానీనే..అసలు కారణం 
2026–27 విద్యా సంవత్సరానికి 1–10 తరగతుల వరకు 35 లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇంటర్మీడియట్‌ వరకు వస్తువులు కొనుగోలు, నాణ్యత పరిశీలన, మండల స్టాక్‌పాయింట్లకు చేరవేత వరకూ రూ.910 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే,  రెండేళ్లకు తమకు రావాల్సిన రూ.1,372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్‌లో పాల్గొనలేమని కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో ప్రభుత్వం చేసేది లేక గత నెలలో బకాయిలు చెల్లించింది. అయితే, ఇందులో విద్యాశాఖలోని ఓ అత్యున్నతాధికారి 5.5 శాతం కమీషన్‌ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు ఈ ఏడాది కిట్లు, వాటిలోని వస్తువులు ఇవ్వలేమని కరాఖండీగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. కానీ వాస్తవాలను దాచిపెట్టిన ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో కిట్ల పంపిణీని ఎగ్గొట్టే యత్నం చేస్తోంది.  

తూచా తప్పకుండా జూన్‌ 12నే జగనన్న విద్యా కానుక 
పుస్తకాలు, యూనిఫారం కొనలేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని గమనించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాను సీఎం కాగానే బడి తెరిచిన మొదటిరోజే జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, టైతో సహా ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏటా జూన్‌ 12న బడులు తెరిచిన తొలిరోజే వీటిని అందించేలా కార్యాచరణ రూపొందించారు. జగనన్న విద్యా కానుక కిట్‌లో నాణ్యమైన పుస్తకాల బ్యాగ్, స్టిచింగ్‌ చార్జ్లీతో 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు ఇంగిŠల్ష్‌– తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ(ఆరోతరగతి), ఎలిమెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీ అందించారు. ఇలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో సగటున ఏటా 43 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యా కానుక అందుకున్నారు. 

కిట్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం: సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు
కిట్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా పాఠశాల పున: ప్రారంభం నాటికే అందజేయాలనే లక్ష్యంతో అన్ని రకాల ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టామని, అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో కిట్ల సరఫరా మరో నెల ఆలస్యం అవుతుందని సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్‌ కొరత, క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభం, ఫైబర్‌ వంటి ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఏర్పడటంతో క్రూడ్‌ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయన్నారు. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని, దీంతో సరఫరాదారులు కొంత గడువు కోరినట్లు వివరించారు. అయితే, చదువుకు ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో జూన్‌ 12న బడులు తెరిచే నాటికే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. ‘మెగా పీటీఎం’ నాటికి మిగిలిన వస్తువుల పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement