పీఎస్‌పీ టెండర్‌లో ఏపీజెన్‌కో ఇష్టారాజ్యం! | Chandrababu Govt: APGENCO favoritism in PSP tender | Sakshi
Sakshi News home page

పీఎస్‌పీ టెండర్‌లో ఏపీజెన్‌కో ఇష్టారాజ్యం!

Apr 5 2026 3:05 AM | Updated on Apr 5 2026 3:05 AM

Chandrababu Govt: APGENCO favoritism in PSP tender

అనంతపురం జిల్లాలో 950 మెగావాట్ల ప్రాజెక్ట్‌ కోసం టెండర్లు 

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్గదర్శకాలకు తూట్లు

ప్రైవేటు సంస్థల కోసం నిబంధనలు మార్చేసిన పెద్దలు 

ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనకుండా వింత షరతులు 

రూ.5 వేల కోట్ల విలువైన టెండర్లను అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం 

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసిన బీహెచ్‌ఈఎల్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్‌ శాఖలో అక్రమాలకు కొదవలేదు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల దగ్గర నుంచి డైరెక్టర్ల నియామకాలు, భారీ టెండర్ల వరకూ ప్రతి చోటా అవినీతికి అడ్డూ అదుపూ లేదు. తాజాగా రూ.5 వేల కోట్ల విలువైన పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (పీఎస్‌పీ) టెండర్‌ను అస్మదీయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన భారీ సంస్థలు టెండర్‌ ప్రక్రియలో పాల్గొనలేని విధంగా.. కేవలం తమకు అనుకూలంగా ఉండే ప్రైవేటు సంస్థలకే టెండర్లు దక్కేలా వింత నిబంధనలు పెట్టారు. అందుకోసం సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) మార్గదర్శకాలకు సైతం తూట్లు పొడిచారు.  

ఇష్టానుసారం నిబంధనలు 
అనంతపురం జిల్లా, యాడికి మండలం, కమలపాడులో 950 మెగావాట్లతో  పీఎస్‌పీ కోసం ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో) ఈ ఏడాది జనవరి 22న టెండర్‌ను విడుదల చేసింది. ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం సుమారు రూ.5 వేల కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ టెండర్‌లో కొన్ని నిబంధనలను సీఈఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా పెట్టింది. టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే సంస్థకు టర్బైన్‌ అనుభవానికి సంబంధించి నిలువు విధానంలో తిరిగే ‘వెర్టికల్‌ ఫ్రాన్సిస్‌ రివర్స్‌బుల్‌ టర్బైన్‌’ నడిపిన అనుభవం ఉండాలని నిబంధన విధించింది. అదే విధంగా మోటార్‌ జెనరేటర్‌ అనుభవానికి సంబంధించి నిలువు అక్షంపై పనిచేసే జల మోటర్‌ విద్యుత్‌ ఉత్పత్తి యంత్రం ‘వెర్టికల్‌ షాఫ్ట్‌ సింక్రోనస్‌ హైడ్రో మోటార్‌ జనరేటర్‌ (118 ఎంవీఏకు పైగా) పనులు చేసిన వారే అర్హులని నిబంధనల్లో ఉంది. ఫలితంగా భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 

కేంద్రానికి బీహెచ్‌ఈఎల్‌ ఫిర్యాదు  
తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్‌ పీఎస్‌పీతో పాటు అనేక రాష్ట్రాల్లో పీఎస్‌పీలు చేపట్టిన అనుభవం తమకు ఉందని, తమకు కూడా కమలపాడు పీఎస్‌పీ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని  బీహెచ్‌ఈఎల్‌ ఏపీజెన్‌కోను విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జెన్‌కో ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డికి అధికారికంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఓ లేఖ కూడా రాసింది. టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే సంస్థకు టర్భైన్‌ అనుభవానికి సంబంధించి ‘వెర్టికల్‌ ఫ్రాన్సిస్‌ టర్భైన్‌ లేదా నీటి పంపు’ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని బీహెచ్‌ఈఎల్‌ అడిగింది. 

అదే విధంగా మోటార్‌ జెనరేటర్‌ అనుభవానికి సంబంధించి జల విద్యుత్‌ యంత్రం(హైడ్రో) మోటార్‌ అనుభవాన్ని కూడా పోటీకి అంగీకరించాలని కోరింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, దేశీయ సంస్థలు టెండర్‌లో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయని, పోటీ కూడా మెరుగవుతుందని పేర్కొంది. కానీ జెన్‌కో నుంచి స్పందన రాలేదు. దీంతో మార్చి 24న సీఈఏకి, మార్చి 26న కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు బీహెచ్‌ఈఎల్‌  ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా పీఎస్‌పీ  టెండర్లలో తామిచ్చిన మార్గదర్శకాలను అనుసరించాల్సిందిగా ఏపీజెన్‌కోకు సీఈఏ సూచించింది. అయినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి మార్పు లేదు.  

సీఈఏ మార్గదర్శకాల ఇవీ 
ప్రస్తుతం దేశంలో సుమారు 7 గిగావాట్ల సామర్థ్యంతో 10 ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. మరో 12 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలో సౌర, గాలి విద్యుత్‌ ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యుత్‌ నిల్వ అవసరం కూడా పెరుగుతోంది. 2030 నాటికి 62 గిగావాట్, 2035 నాటికి 161 గిగావాట్‌ నిల్వ అవసరం ఉంటుందని సీఈఏ అంచనా వేసింది. 2035–36 నాటికి 100 గిగావాట్ల హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా దేశంలో పీఎస్‌పీలను ప్రోత్సహించడానికి ఈ ఏడాది జనవరి 8న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం..ప్రభుత్వ రంగ సంస్థలు పీఎస్‌పీ టెండర్లలో పాల్గొనాలంటే వాటికి పీఎస్‌పీ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం నేరుగా ఉండనక్కర్లేదు.  దానికి సమానమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసిన అనుభవం ఉంటే సరిపోతుంది. 

హైడ్రో ప్రాజెక్టులు, డ్యామ్‌లు, పెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు చేసిన అనుభవాన్ని కూడా పీఎస్‌పీకి అర్హతగా పరిగణించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర సంస్థలతో కలిసి చేసిన ప్రాజెక్టుల అనుభవాన్ని కూడా అంగీకరించవచ్చు. ఇతర సంస్థలతో కలిసి బిడ్‌ వేస్తే కన్సార్టియం అనుభవాన్ని అర్హతగా చూపించుకోవచ్చు. ప్రాజెక్ట్‌ను స్వయంగా చేయకపోయినా కాంట్రాక్టర్‌ అనుభవాన్ని ఆధారంగా సమర్పించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ టెండర్‌ దక్కించుకుంటే కేంద్ర ప్రభుత్వ నుంచి అనుమతులు సకాలంలో వచ్చి ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. భూ సేకరణ త్వరగా జరుగుతుంది. రిక్స్‌ కూడా బాగా తక్కువ. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలు లభిస్తాయి. దీంతో ప్రాజెక్ట్‌ ఖర్చు తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో, ఒకే ప్రభుత్వ సంస్థ బిడ్‌ చేసినా కూడా టెండర్‌ను రద్దు చేయకుండా అంగీకరించవచ్చు. కానీ జెన్‌కో టెండర్లలో ఈ మార్గదర్శకాలను పట్టించుకోలేదు.  

సీఎం కల్పించుకోవాలి 
కమలపాడు పీఎస్‌పీ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలి.  టెండర్‌ నిబంధనలను సీఈఏ మార్గదర్శకాల ప్రకారం సవరించాలి.  
– విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎం.నాగేశ్వరరావు, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ 

అర్హత ఉంటే ఎవరైనా టెండర్‌ వేయవచ్చు 
ఈ నెల 6 వరకూ టెండర్‌ దాఖలు చేయడానికి గడువు ఉంది.  అప్పటికి ఎవరూ టెండర్‌ వేయకపోతే గడువును మరోసారి పొడిగిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలేవైనా అర్హత ఉంటే టెండర్‌ ప్రక్రియలో పాల్గొనవచ్చు. 
– ఏపీ జెన్‌కో 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement