
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు
కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి
మృతులంతా బంధువులే.. పరామర్శకు వెళ్తుండగా ఘటన
అసలే ఇసుక మాఫియా.. ఆపై తప్పతాగిన డ్రైవర్.. అందువల్లే ఘోర ప్రమాదం
ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడంతో కేసు తారుమారుకు యత్నాలు
డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు.. పరారీలో అసలు డ్రైవర్
లొంగిపోయింది నకిలీ అని ప్రచారం
రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణమిది.. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది.. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక.. ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది.. 30–40 టన్నుల లోడ్‌తో అతి వేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి.. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు.. అయినా ఏమాత్రం స్పందించని సర్కారు పెద్దలు మీకింత–మాకింత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం.
సంగం: సగం జీవితం కూడా చూడని ఆ ఏడుగురికీ అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.. సాయంత్రానికల్లా ఇంటికొస్తామని పిల్లలకు చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఇసుక మాఫియా తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నేత ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో అతివేగంగా ఎదురుగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. అనధికారికంగా పడమటి కంభంపాడు వద్ద నిర్వహిస్తున్న క్వారీ నుంచి సంగం మండలానికి చెందిన టీడీపీ నేతకు చెందిన టిప్పర్ ఇసుక లోడ్‌తో నెల్లూరు వైపు రాంగ్ రూట్‌లో బయలు దేరింది. అదే సమయంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న కారును పెరమన వద్ద అతివేగంతో ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తాళ్లూరి శ్రీనివాసులు (40), తాళ్లూరి రాధ (36), ఇందుకూరుపేటకు చెందిన చల్లగుండ శ్రీనివాసులు (40), చల్లగుండ్ల లక్ష్మి (34), శేషం సారమ్మ (40), శేషం వెంగయ్య (38), కారు డ్రైవర్ కత్తి బ్రహ్మయ్య (24) కారులోనే మృతి చెందారు.
టిప్పర్ అతి వేగంగా కారును ఢీకొనడంతో వీరి శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఘటనలో మృతి చెందిన వారంతా బంధువులే. తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ భార్యాభర్తలు. వీరు నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో సాయి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. వీరి వద్ద కత్తి బ్రహ్మయ్య పని చేస్తున్నారు. చల్లగుండ్ల శ్రీనివాసులు, చల్లగుండ్ల లక్ష్మి భార్యాభర్తలు. శేషం సారమ్మ, శేషం వెంగయ్య వదినా మరుదులు. మృతి చెందిన తాళ్లూరు రాధ.. చల్లగుండ్ల లక్ష్మికి, శేషం వెంగయ్యకు చెల్లెలు.
పరామర్శకు వెళ్తూ..
తాళ్లూరు రాధ, చల్లగుండ్ల లక్ష్మి, శేషం వెంగయ్యల చిన్న చెల్లెలు భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆత్మకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు తాళ్లూరు శ్రీనివాసులు తన కారులో వీరందరినీ తీసుకుని వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. తన వద్ద పనిచేసే కత్తి బ్రహ్మయ్యను కారు డ్రైవింగ్ కోసం తీసుకు రావడంతో అతడు కూడా మత్యువాత పడ్డాడు.
అతి కష్టం మీద మృతదేహాల వెలికితీత
సుమారు 40 టన్నుల ఇసుక ఉన్న 12 టైర్ల టిప్పర్.. రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకు రావడంతో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ క్షణాల్లో చనిపోయారు. వారి మృతదేహాలు సైతం చిద్రమయ్యాయి. వెలికి తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకుని సంగం సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సంగం సర్కిల్‌లోని పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కారు సగ భాగం పూర్తిగా టిప్పర్ ఇంజిన్‌లోకి వెళ్లడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు రెండు క్రేన్లు, ఒక జేసీబీ, కట్టర్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని ఆర్డీఓ భూమిరెడ్డి పావని, ఎంవీఐ రాములు పరిశీలించారు. బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ అజిత ఏజెండ్ల ఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ లొంగిపోయాడని మీడియాకు వెల్లడించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నదీ, లేనిదీ విచారిస్తామని చెప్పారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్నది ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కాదని, నకిలీ అని విశ్వసనీయ సమాచారం.
మృతుల్లో తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇటీవల మృతి చెందడంతో ఆ బాధను దిగమింగుతూ కుమారుడిపై ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు. చల్లగొండ్ల శ్రీనివాసులు, చల్లగొండ్ల లక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. శేషం సారమ్మ, శేషం బాలవెంగయ్యల కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది. శేషం బాలవెంగయ్య బేల్దారి పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరా కరువైంది.

ఇసుక మాఫియా తీరుపై వైఎస్ జగన్ మండిపాటు
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఇసుక మాఫియా వల్ల చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉచిత ఇసుక ముసుగులో సాగిస్తున్న దందాను ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు.
‘నెల్లూరు’లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
టిప్పర్ ఓనర్ మంత్రి ఆనం అనుచరుడే
ఏడుగురు మరణానికి కారణమైన టిప్పర్ (ఏపీ39డబ్ల్యూహెచ్1695) మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్ పేట మండలం చిరమనకు చెందిన కాటం రెడ్డి రవీంద్రారెడ్డిదిగా గుర్తించారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. అతివేగంతో వస్తూ అదుపు చేయలేక కారును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారును ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ టిప్పర్ దిగి పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ నేత టిప్పర్ కావడంతో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.