సాక్షి, విశాఖపట్నం: పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మారుస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీవితాల్లో వెలుగులు నింపకుండానే సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి 2 లక్షలకు పైగా కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం.. మళ్లీ అందులో వడపోత కోసం రీ–సర్వే పేరుతో పేదోడి ఇంటిపై బంగారు కత్తి వేలాడదీసింది. ఫలితంగా ఆ సంఖ్యను లక్షకు కుదించేసింది. 2024 అక్టోబర్‌లో పీ–4 ప్రారంభించినప్పుడు.. ‘వచ్చే ఉగాది నాటికి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారు.
ఇప్పటికి రెండు ఉగాదులు గడిచిపోయినా ఆ కుటుంబాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. సర్కారుపై నమ్మకం లేని సంపన్న వర్గాలు మొహం చాటేస్తున్నాయి. దీంతో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులైనా మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతూ మార్గదర్శులను ఎంపిక చేసినా.. ఈ పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరిట హడావుడి చేస్తుండటం కొసమెరుపు.
పేదలను ఆదుకునేందుకే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్(పీ–4) విధానాన్ని తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు, మొదటి 20 శాతం ఉన్న సంపన్న కుటుంబాల ద్వారా సాయమందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీనిపై మంత్రులు, అధికారులు సమీక్షల పేరిట మొదట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే సచివాలయాల వారీగా సర్వేలు నిర్వహించి, జిల్లాలో లక్షకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరికి సంపన్నుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామంటూ 2024 ఆగస్టులోనే మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా భరోసా దక్కలేదు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరకపోవడంతో పేద వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
స్క్రిప్ట్‌డ్ సక్సెస్ స్టోరీలు
విఫలమైన పథకాన్ని విజయవంతమైనట్లు చూపడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని కుటుంబాలకు.. వేదికపై ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? అనే అంశాలపై ముందుగానే శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల మంది మార్గదర్శులు ఉంటే, కేవలం 20 మందికి మాత్రమే అవార్డులు ఇస్తుండటం చూస్తుంటే.. అసలు ఆ కుటుంబాలకు ఎంతమేర సాయం అందుతుందో అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా పీ–4 విఫలమైందని స్పష్టమవుతున్నా, సంబరాలు చేసుకోవడంపై జిల్లా అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని భావించిన నిరుపేదలకు నిరాశే మిగులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహిస్తే ప్రజల ముందు అభాసుపాలవుతామని కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
వడపోతలతో పేదల సంఖ్య తగ్గింపు
2024 అక్టోబర్ 2న పీ–4ను ప్రారంభిస్తూ, 2025 ఉగాది నాటికి బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వం పునఃసర్వే పేరుతో పదే పదే వడపోతలు చేస్తూ లబి్ధదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. ఫలితంగా మొదట గుర్తించిన భారీ సంఖ్య కాస్త ప్రస్తుతం 1,05,126 కుటుంబాలకు పడిపోయింది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శులుగా సంపన్నులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై నెట్టింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 7 వేల మంది మార్గదర్శులను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సాయం చేసే విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సంపన్నుల నుంచి స్పందన లేకపోవడంతో.. కనీసం ప్రజాప్రతినిధులైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
విఫల పథకానికి విజయోత్సవాలా?
పీ–4 పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా, కాగితాలపై కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అధికారులే ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని చేతులెత్తేసినా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. జిల్లాలో గుర్తించిన 1,05,126 కుటుంబాల్లో కేవలం 66 వేల కుటుంబాలనే దత్తత తీసుకోవడం పథకం డొల్లతనాన్ని చాటుతోంది. పోనీ వారి జీవితాల్లో అయినా.. మార్పులు తీసుకొచ్చారా అంటే అదీ లేదు. లక్షకు పైగా కుటుంబాలకు కేవలం 7 వేల మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. ఇందులోనూ కొందరు వ్యాపారవేత్తలను బలవంతంగా మార్గదర్శులుగా చేర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


