‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

Central Team Inspected MGNREGA Works In Kurnool district - Sakshi

ఓర్వకల్లు: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు సభ్యులు అమర్‌జిత్‌సిన్హా నేతృత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం పర్యటించింది. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించింది. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మునగ తోటను పరిశీలించి పంట దిగుబడి, పెట్టుబడుల ఖర్చుల వివరాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

మునగ సాగు లాభసాటిగా ఉందని, దిగుబడులకు తగ్గట్టు మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతు వివరించారు. సమీపంలో ఉపాధి హామీ పథకం కింద తవ్విన అమృత్‌ సరోవర్‌ (నీటి కుంట)ను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కుంట ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ప్రయోజనాలు, పనితీరుపై గ్రామస్తులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధి పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, రైతుల పంట పొలాలను అభివృద్ధి చేయాలని, పొలం రస్తాల వెంటవున్న కంపచెట్లను తొలగించాలని పలువురు కోరారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి పథకమే తమను ఆదుకుందని, లేకపోతే ఎంతో మంది పస్తులుండాల్సి వచ్చేదని లక్ష్మీదేవి, శారదమ్మ అనే మహిళలు చెప్పారు. కేంద్ర బృందంలో కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ పంకజ్, ఎస్‌సీఏఈఆర్‌ ఎన్‌డీఐసీ డైరెక్టర్‌ సోనాల్డ్‌ దేశాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఎకనామికల్‌ అడ్వైజర్‌ ప్రవీణ్‌ మెహతా, ఎన్‌ఐఆర్‌డి–పీఆర్‌ ప్రొఫెసర్‌ జ్యోతిస్‌ పాలన్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కోటేశ్వరరావు, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సమష్టిగా నడుద్దాం.. క్లీన్‌ స్వీప్‌ చేద్దాం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top