ఏపీని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్‌ అహూజా

Central Government Secretary Manoj Ahuja on E-Crop - Sakshi

అన్ని రాష్ట్రాల్లో ఈ–క్రాప్‌ అమలు చేయండి

2023 మార్చికల్లా ఆచరణలోకి తీసుకురండి

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్‌ అహూజా సూచన

కేంద్ర స్టీరింగ్‌ కమిటీలో ఏపీకి భాగస్వామ్యం

కమిటీలో స్పెషల్‌ సీఎస్‌ పూనమ్‌కు ప్రాతినిధ్యం

ఈ–క్రాప్‌పై జాతీయస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌

వివిధ రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసిన ఏపీ అధికారులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్న ఎలక్ట్రానిక్‌ క్రా పింగ్‌ (ఈ–క్రాప్‌)ను 2023 మార్చికల్లా అన్ని రా ష్ట్రాలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్‌ అహూజా సూచించారు. ఏపీని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్‌ అమలుచేయాలని సూచించారు. అగ్రిస్టాక్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ–క్రాపింగ్‌ అమలుపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖాధికారులతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.

ఈ సమావేశంలో అహూజా మాట్లాడుతూ వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏపీలో ఈ క్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీసీజన్‌లో అన్ని రాష్ట్రాలు పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ–క్రాపింగ్‌ను అమలు చేయాలని సూచిం చారు. 2023 మార్చి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.

ఏపీలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న చోట ఆన్‌లైన్‌లో, లేని చోట ఆఫ్‌లైన్‌లో ఈ–క్రాపింగ్‌ నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇదే హైబ్రిడ్‌ విధానంలో అన్ని రాష్ట్రాలూ పాటించాలన్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని చోట ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి, ఆ వివరాలను ఇంటర్నెట్‌ ఉన్న చోట ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు.

రైతులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా
ఈ–క్రాప్‌ అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ ఇతర రాష్ట్రాల అధికారులకు వివరించారు. వాస్తవ సాగుదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ఈ–క్రాపింగ్‌ను డిజైన్‌ చేసినట్లు తెలిపారు.

ఈ–క్రాపింగ్‌ ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం, పంటల బీమా వంటి అన్ని పథకాలనూ అందిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లను కూడా దీని ఆధారంగానే చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆర్బీకేలు, సచివాలయాల్లో ఉండే వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సçహాయకులు సంయుక్తంగా ఈ–క్రాపింగ్‌ నమోదు చేసి, ప్రతి రైతుకు రశీదులు ఇస్తున్నారన్నారు.

వివిధ రాష్ట్రాల అధికారుల సందేహాలను స్పెషల్‌ సీఎస్, కమిషనర్‌ నివృత్తి చేశారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ సర్వే పూర్తయితే భూముల సరిహద్దులు కచ్చితంగా నిర్ధారణ అవుతాయని, ఈ క్రాప్‌ను మరింత పక్కాగా ఇంటిగ్రేట్‌ చేయవచ్చని చెప్పారు.

జాతీయ స్టీరింగ్‌ కమిటీలో తొలిసారి ప్రాతినిధ్యం
కేంద్ర వ్యవసాయ పథకాలు, కార్యక్రమాల అమలుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రాతినిధ్యం కల్పించారు. ఈ కమిటీలో ఓ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి, కార్యదర్శులు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా తీసుకొని ఈ–క్రాపింగ్‌ను అమలు చేస్తున్నందున ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌కు కూడా చోటు కల్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top