గ్రామాలకు ఎల్‌ఈడీ వెలుగులు | Sakshi
Sakshi News home page

గ్రామాలకు ఎల్‌ఈడీ వెలుగులు

Published Wed, Apr 6 2022 4:10 AM

Central government to fill villages with LED lights - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామాలను ఎల్‌ఈడీల వెలుగులతో నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గ్రామ ఉజాల’ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 4.36 లక్షల ఎల్‌ఈడీ బల్బులను కూడా పంపిణీ చేయగా, ఇకపై భారీగా పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. గ్రామ ఉజాల పథకానికి దేశంలో కేవలం ఐదు రాష్ట్రాలనే కేంద్రం ఎంపిక చేసింది. వాటిలో ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తెలంగాణతో పాటు మన రాష్ట్రం కూడా ఉంది. ఈ పథకం ద్వారా ఏపీతో కలిపి ఐదు రాష్ట్రాల్లో కోటి ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయాలని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ సంస్థ కన్వర్జన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) నిర్ణయించింది. 

సహకరించాలని కోరిన సీఈఎస్‌ఎల్‌
దశలవారీగా గ్రామీణ గృహాలకు నాణ్యమైన లైటింగ్‌ను అందించడం గ్రామ ఉజాల పథకం లక్ష్యం. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ వల్ల విద్యుత్‌ బిల్లులు కొంతమేర తగ్గుతాయి. విద్యుత్‌ సంస్థలకు గరిష్ట డిమాండ్‌ను గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఉజాల పథకం అమలుకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను సీఈఎస్‌ఎల్‌ ఇటీవల కోరింది. ఈమేరకు ఎండీ మహువా ఆచార్య ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌కు లేఖ రాశారు. గ్రామీణ ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుతో అందించాలనే తమ ప్రయత్నానికి తోడవుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఈఎస్‌ఎల్‌కు ఇంధన శాఖ కార్యదర్శి తిరిగి లేఖ పంపారు.


మన్నిక ఎక్కువ
ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో గతేడాది డిసెంబర్‌ 14న 10 లక్షల ఎల్‌ఈడీ బల్బులను సీఈఎస్‌ఎల్‌ అందించింది. మన రాష్ట్రంలోని అప్పటి వైఎస్సార్‌ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో లక్షకు పైగా ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసింది. వీటితో కలిపి మొత్తం 4.36 లక్షల ఎల్‌ఈడీ బల్బులు రాష్ట్రానికి చేరాయి.వినియోగదారుడు బల్బుకు రూ.10 చెల్లిస్తే చాలు.ఎల్‌ఈడీ బల్బుల పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును సీఈఎస్‌ఎల్‌ భరిస్తుంది. విద్యుత్‌ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. ఎల్‌ఈడీ బల్బుల సామర్థ్యం ఎక్కువ. నాణ్యతతో దీర్ఘకాలం మన్నుతాయి. సాధారణ బల్బులతో పోల్చినప్పుడు 88 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. 25 రెట్ల కాంతి ఎక్కువ ఉంటుంది. సీఎఫ్‌ఎల్‌ బల్బులతో పోలిస్తే ఎల్‌ఈడీలు తక్కువ వేడిని విడుదల చేస్తాయి. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement