
గతంలో తక్కువ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాలు.. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గుర్తించండి
ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు ప్రణాళికలు అమలు చేయండి
పట్టణ ప్రాంతాల ఓటర్లు, యువత ఉదాసీనతపై దృష్టిపెట్టండి
2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని పట్టణాల్లో కేవలం 67.4 శాతమే పోలింగ్
అప్పట్లో రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్
ఆ ఎన్నికల్లో ఏపీలో 79 శాతం పోలింగ్.. ఇప్పుడు 83 శాతం లక్ష్యం
సీఈఓలు, జిల్లాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని వీలైనంత ఎక్కువగా పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు, యువత పోలింగ్‌కు రాకుండా ఉదాసీనంగా వ్యహరించడంతో ఆ ప్రాంతాల్లో కేవలం 67.4 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సవాల్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా.. తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు, జిల్లాల ఎన్నికల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది.
గత ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలు, అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను గుర్తించాలని సూచించింది. తక్కువ శాతం పోలింగ్ నమోదవడానికి కారణాలను విశ్లేషించి పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా చర్యలను చేపట్టాలని సూచించింది. అలాగే, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, నిరాశ్రయులైన వివిధ అట్టడుగు వర్గాలు, సంచార సమూహాలు, సెక్స్ వర్కర్లు, క్లిష్ట పరిస్థితుల్లోని మహిళలు మొదలైన వారిని గుర్తించి వారందరినీ పోలింగ్‌లో భాగస్వామ్యం చేయడానికి అట్టడుగుస్థాయి నుంచి చర్యలు చేపట్టాలని తెలిపింది.
ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలను అమలుచేయాల్సిందిగా సీఈఓలు, డీఈఓలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏ ఒక్క ఓటరును వదిలేయకూడదనే లక్ష్యంగా చర్యలు ఉండాలని స్పష్టంచేసింది. ఇందుకోసం ఎన్నికలను ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగగా ప్రచారం చేయడంతో పాటు ఒక వ్యక్తి ఓటు వేయడం ద్వారా దేశం గర్విస్తుందనే భావనతో ప్రచారం నిర్వహించాలని కోరింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఓటరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
ఈ నినాదాలతో ప్రచారం చేయండి..
ఇక ఓటర్ల భాగస్వామ్యం పెంచడానికి ‘‘చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్’’.. అలాగే, మొదటిసారి ఓటర్లను పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ‘‘మేరా పెహలే ఓట్ దేశ్‌కే లియే’’ నినాదాలతో ప్రచారాలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రభావితం చేసే వ్యక్తులు, సెలబ్రిటీల ద్వారా ఓటర్లలో అవగాహన కల్పించేందుకు స్మార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ‘నా ఓటు నా డ్యూటీ’ అంటూ కూడా ప్రచారం కల్పించాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ మరింత సమ్మిళితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
రాష్ట్రంలో 83 శాతం పోలింగ్ లక్ష్యం
ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 79 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 83 శాతం లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం చర్యలు చేపడుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 శాతంలోపే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
85 ఏళ్ల పైబడిన ఓటర్లు, అంగవైకల్యం వారికి పోస్టల్ బ్యాలెట్
ఇక రాష్ట్రంలో మే 13న జరగనన్ను ఎన్నికల్లో 85 పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. అలాగే, కోవిడ్ సోకిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ జారీకి కూడా మరో నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన ఓటర్లు 2,12,237 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్ అనేది వీరికి ఐచ్ఛికం. పోలింగ్ కేంద్రానికి వచ్చి కూడా ఓటు వేయవచ్చు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12 పూరించి రిటర్నింగ్ అధికారికి ఇచ్చాక, ఆయన పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించిన తరువాత అలాంటి వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉండదు.
అలాగే, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్‌కు చేసేందుకు అవకాశం ఉంటుంది. శారీక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ జారీకి అనుమతిస్తారు. ఇక పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి పొందిన వారు పోలింగ్ తేదీకి పది రోజుల ముందే వారి ఇంటి వద్దే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వీడియోగ్రాఫర్‌తో సహా ఐదుగురు పోలింగ్ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తారు. ఆ బ్యాలెట్‌ను రెండు కవర్లలో ఉంచి పోలింగ్ బ్యాక్సులో వేస్తారు.