తారాగిరి.. ‘జల’భేరి | A Brand New Warship in the Navys Arsenal | Sakshi
Sakshi News home page

తారాగిరి.. ‘జల’భేరి

Mar 22 2026 4:53 AM | Updated on Mar 22 2026 4:53 AM

A Brand New Warship in the Navys Arsenal

శత్రువుల పాలిట ‘సంద్ర’శాసనం ఐఎన్‌ఎస్‌ తారాగిరి

నౌకాదళ అమ్ముల పొదిలో సరికొత్త యుద్ధ నౌక 

ప్రాజెక్టు 17ఏలో వస్తున్న నాలుగో శక్తివంతమైన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ 

75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో 200 ఎంఎస్‌ఎంఈల సహకారంతో నిర్మాణం

ముంబైలోని మజ్‌గావ్‌డాక్‌ షిప్‌ బిల్డర్స్‌(ఎండీఎల్‌)లో నిర్మితమైన నౌక 

రాడార్లకు చిక్కకుండా స్లీకర్‌ డిజైన్‌తో తయారీ

కోడాగ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌తో అత్యంత వేగంగా, సుదీర్ఘంగా ప్రయాణించే నౌక 

వచ్చే నెల 3న జాతికి అంకితం కానున్న ఐఎన్‌ఎస్‌ తారాగిరి

ఉప్పొంగే నీలి సంద్రం జయజయజయ ‘జల’హే అంటూ నినదిస్తోంది. నింగీనేలా నివ్వెరబోయేలా జైహింద్‌     అంటూ గర్జిస్తోంది. భారత నావికా దళ అమ్ములపొదిలో సమకూరిన సరికొత్త యుద్ధ నౌక జలప్రవేశానికి స్వాగతం పలుకుతోంది. శక్తివంతమైన ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి’.. విజయభేరికి ఉద్యుక్తమవుతోంది.  

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిçష్కృతం కానుంది. ‘ఆత్మ నిర్భర భారత్‌’ నినాదంతో హిందూ సముద్ర జలాలపై పట్టును మరింత బిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. అత్యాధునిక సాంకేతికత, శత్రువు కంటపడని ‘స్టెల్త్‌’ ఫీచర్లతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి’ వచ్చే నెల 3న జలప్రవేశానికి సిద్ధమవుతోంది. 75శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక.. కడలి గర్భాన దాగిన కరుడుగట్టిన శత్రువునైనా ఓడగొట్టగలదు. హిందూ మహాసముద్రంలో భారత్‌ ఆధిపత్యానికి ఇది నాంది పలకనుంది. రక్షణ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. 

33 ఏళ్లపాటు సేవలందించిన పూర్వపు నౌక పేరుతోనే..   
1980 నుంచి 2013 వరకూ 33 ఏళ్ల పాటు సేవలందించిన లీండర్‌–తరగతి ఫ్రిగేట్‌ అయిన పూర్వపు ఐఎన్‌ఎస్‌ తారాగిరి పేరుతోనే దీన్ని నిర్మించారు. అత్యాధునిక ప్రాజెక్ట్‌–17లో భాగంగా మల్టీ–మిషన్‌ స్టెల్త్‌ ఫ్రిగేట్‌గా రూపొందిన నీలగిరి శ్రేణికి చెందిన నాలుగో వార్‌షిప్‌ ఇది. 93 నెలల్లో నిర్మితం కావాల్సిన ఈ షిప్‌ ముంబైలోని మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)లో 81 నెలల్లోనే పూర్తికావడం విశేషం. స్లీకర్‌ డిజైన్‌తో తయారైన ఈ  నౌక రాడార్లకు చిక్కకుండా సముద్ర జలాల్లో వందశాతం నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలదు. 

భారత నౌక నిర్మాణ నైపుణ్యాన్ని ఇది చాటిచెబుతోంది. ఈ నౌక జలప్రవేశం ముంబైలో కానీ.. విశాఖలో కానీ నిర్వహించే అవకాశం ఉంది.  తారాగిరి తయారీలో 200 ఎంఎస్‌ఎంఈలు పాల్గొన్నాయి. దీని నిర్మాణం ద్వారా నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించారు. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికిని అడ్డుకోవడానికి భారత్‌ 2030 నాటికి 175 యుద్ధ నౌకలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తారాగిరి చేరిక చాలా కీలకంగా మారనుందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.  

తారాగిరి పవర్‌ ఇదీ.. 
» తారాగిరిలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిసైల్‌గా.. శత్రు నౌకల్ని క్షణాల్లో తుత్తినీయలు చేసే 8 బ్రహ్మోస్‌ క్షిపణులు ఉంటాయి. 
»  ఇజ్రాయిల్‌ సహకారంతో రూపొందించిన లాంగ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌మిసైల్‌ బరాక్‌–8 ఉంటుంది. ఇది శత్రు విమానాల్ని లేదా డ్రోన్లని గాల్లోనే నిరోధిస్తుంది. 
» నీటి అడుగున ఉండే సబ్‌మెరైన్లని వేటాడేందుకు అత్యాధునిక సోనార్‌ వ్యవస్థతో పనిచేసే 2 వరుణాస్త్ర ట్రిపుల్‌ టార్పెడోలు, 72 యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంచర్లు ఉంటాయి.   
»   కోడాగ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌తో తారాగిరి అత్యంత వేగంగా.. సుదీర్ఘంగా ప్రయాణించగలదు.   

ఐఎన్‌ఎస్‌ తారాగిరి మరిన్ని విశేషాలు 
పొడవు– 149 మీటర్లు 
బీమ్‌– 17.8 మీటర్లు 
డ్రాఫ్ట్‌– 5.22 మీటర్లు  
బరువు– 6670 టన్నులు 
వేగం– 28 నాటికల్‌ మైళ్లు  
రేంజ్‌– 5,500 నాటికల్‌ మైళ్లు 
సిబ్బంది–  226 మంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement