తృటిలో తప్పిన పెద్ద పడవ ప్రమాదం

Boat capsized P Gannavaram mandal Ambedkar Konaseema District - Sakshi

సర్పంచ్‌ భర్త, ముగ్గురు వలంటీర్లు సహా 8 మంది సురక్షితం 

పి.గన్నవరం: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో పెద్ద పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సీజన్‌లో గోదావరికి రెండోసారి వరదలు వచ్చిన నేపథ్యంలో.. మానేపల్లి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాయలంకలోని వరద బాధితులకు సర్పంచ్‌ పితాని చంద్రకళ భర్త నరసింహారావు రోజూ పడవపై వాటర్‌ టిన్నులు తీసుకువెళ్లి అందిస్తున్నారు.

ఇదేవిధంగా నరసింహారావు, వలంటీర్లు కౌరు నందు, షేక్‌ రెహ్మాన్, చిన్నం రవీంద్ర 40 వాటర్‌ టిన్నులు తీసుకుని ఆదివారం శివాయలంకకు బయల్దేరారు. ఆ పడవలో కౌరు శ్రీను, పుచ్చకాయల సత్యనారాయణ, పడవ నడిపే వ్యక్తులు మల్లాడి ఏడుకొండలు, రామకృష్ణ ఉన్నారు. ఏటిగట్టు నుంచి 300 మీటర్ల దూరం వెళ్లేసరికి కేబుల్‌ టీవీ మెయిన్‌ లైన్‌ వైరు పడవకు అడ్డం పడింది. దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన పడవ వైనతేయ గోదావరి నదిలో బోల్తా పడింది.

ఆ ప్రాంతంలో నది సుమారు 10 అడుగుల లోతు ఉంది. అందులో ఉన్న 8 మంది అతికష్టం మీద సమీపంలోని మెరక ప్రాంతంలోని రోడ్డు పైకి చేరుకుని వరద నీటిలో నిలుచున్నారు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది హుటాహుటిన మరో పడవను పంపించి, నదిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తరలించారు. వలంటీర్‌ రవీంద్ర నదిలో మునిగి నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ ప్రాంతంలో వరద ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top