ఆ కుట్ర వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర ఉంది: భూమన

Bhumana Karunakar Reddy Comments On Pegasus Spyware - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీకి అడ్డదారిలో రాజకీయ లబ్ధి కలిగించేందుకు 2016–2019లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి పాల్పడ్డారని డేటా చోరీ అంశంపై విచారణకు శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆనాటి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ల డైరెక్షన్‌లోనే డేటా చోరీ జరిగినట్లు ఉపసంఘం విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే నివేదికను శాసనసభకు సమర్పిస్తామని చెప్పారు.

ఆ తర్వాత శాసనసభ సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో శాసనసభా ఉపసంఘం వరుసగా రెండో రోజు బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలన్నీ అత్యంత గోప్యమైనవని అధికారులు సభా సంఘానికి తెలిపారు. అటువంటి వివరాలు ‘సేవా మిత్ర’ అనే యాప్‌ నిర్వహించిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి చేరడం అంటే ప్రభుత్వ పెద్దల ద్వారానే జరుగుతుందని అప్పటి ఐటీ, ఆర్టీజీఎస్‌ ఉన్నతాధికారులు వివరించినట్టు సమాచారం.

చదవండి: (అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్‌ ప్రభాకర్‌)

సమావేశం అనంతరం ఉపసంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ప్రజల భద్రత, వ్యక్తిగత గోప్యత హక్కులకు భంగకరంగా వ్యవహరించిందన్నారు. ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన వివరాలను టీడీపీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన సేవా మిత్ర యాప్‌తో అనుసంధానించారన్నారు. తద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర పన్నినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఓటర్ల తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నిందని ఆయన చెప్పారు.

అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఈ వ్యవహారాన్ని గుర్తించి టీడీపీ కుట్రను అడ్డుకుందన్నారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం టీడీపీకి చెందిన యాప్‌ నిర్వాహకులకు చేరడం వెనుక చంద్రబాబు, లోకేశ్‌ల హస్తం ఉందన్నారు. ఆ స్థాయి పెద్దల పాత్రతోనే అంతటి గోప్యమైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తమకు వివరించారని భూమన తెలిపారు. గురువారం మరోసారి అధికారులతో సమావేశమైన అనంతరం తమ నివేదికను శాసనసభకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహనరావు, మద్దాల గిరి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top