అన్ని వర్గాల వికాసానికి సీఎం జగన్‌ అండ

Avanthi Srinivas Comments On CM Jagan Support To all social classes - Sakshi

తెలుగు సాహిత్యం, సంగీత, నృత్య, నాటక రంగాల వికాసానికి ప్రభుత్వం కృషి

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అందించి అన్ని సామాజిక వర్గాల వికాసానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు సాహిత్యం, సంగీత, నృత్య, నాటక రంగాల అభ్యున్నతకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వివిధ అకాడమీల సభ్యుల ప్రమాణ స్వీకారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం,  సంగీతం, నృత్యం, నాటక రంగాల్లో బహుముఖ పురోగతి, పద్య, ఆధునిక నాటక వికాసం, శిల్ప, చిత్రకళల అభివృద్ధి, జానపద కళారూపాల అభివృద్ధి, ఆధునికీకరణ, తెలుగు ప్రజల చారిత్రక పరిశోధన, ఆవిష్కరణ, టెక్నాలజీ, డిజిటల్‌ రంగాలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణ లక్ష్యాలుగా ప్రభుత్వం ఏడు అకాడమీలను పునరుద్ధరించిందని వివరించారు. ఈ అకాడమీలకు ఇదివరకే చైర్మన్లను నియమించామని తెలిపారు. ఆయా అకాడమీలకు ప్రభుత్వం నామినేట్‌ చేసిన డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనందంగా ఉందన్నారు.

నూతనంగా ఎన్నికైన వారంతా అకాడమీల కీర్తి, ప్రతిష్టలను పెంచేలా కృషిచే యాలని కోరారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను అభినందించారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌ పి.శ్రీలక్ష్మి, సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌ పి.శిరీష యాదవ్, నాటక అకాడమీ చైర్మన్‌ ఆర్‌.హరిత, దృశ్య కళల అకాడమీ చైర్మన్‌ కుడుపూడి సత్యశైలజ, జానపద కళల చైర్మన్‌  కె.నాగభూషణం, చరిత్ర అకాడమీ చైర్మన్‌ కె.నాగమల్లేశ్వరి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌ టి.ప్రభావతి, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్మన్‌ వంగపండు ఉష, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ భార్గవ, సీఈవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top