భర్త బాధితులకు ‘దిశ’ భరోసా | Assuring Disha Act To Husband Victims | Sakshi
Sakshi News home page

భర్త బాధితులకు ‘దిశ’ భరోసా

Dec 12 2020 8:03 PM | Updated on Dec 12 2020 8:42 PM

Assuring Disha Act To Husband Victims - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల స్పందనతో నిలిచిన ప్రాణం..
తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక వివాహిత అర్ధరాత్రి 1:59 గంటలకు దిశ యాప్‌ ద్వారా పోలీసు సాయం కోరింది. తన భర్త వేధింపుల కారణంగా తాను నిద్రమాత్రలు మింగినట్టు తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఐదు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని భర్త చెప్పడంతో వారి కాపురాన్ని పోలీసులు నిలబెట్టినట్లయింది.

బెదిరించిన యువకుడి అరెస్ట్‌..
కర్నూలు జిల్లాలోని ఆస్పరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఒక యువతిని వేధించాడు. అందుకు అంగీకరించని ఆమె పెళ్లి చెడగొట్టేందుకు లెటర్‌ రాస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

బాలికను వేధించినందుకు కేసు..
గుంటూరు జిల్లా వట్టిచెరుకురు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక బాలిక (12)ను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పొరుగింటి యువకుడు చొరబడి వేధించాడు. ఇది గమనించిన స్థానికులు దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి బాలికను కాపాడటంతోపాటు ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు... ఇలా భర్త చేతిలో దెబ్బలు తిని కాపాడమని కోరిన గృహిణులతోపాటు ఆకతాయిల వేధింపులకు గురైన విద్యార్థినులు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో అపరిచితుల అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన యువతులకు దిశ యాప్‌ వరంలా మారింది. 

సాక్షి, అమరావతి: భర్త బాధితులైన పలువురు గృహిణులు దిశ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. దిశ కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందిస్తున్నారు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కౌన్సెలింగ్‌ ద్వారా కాపురాలు చక్కదిద్దుతున్నారు. దిశ కాల్‌ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ను పోలీసులు విశ్లేషించగా.. భర్త బాధితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తెచ్చిన సంగతి తెల్సిందే. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 8న దిశ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను దాదాపు 12 లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకోగా, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్‌లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితలు సైతం ఉండటం గమనార్హం. అనేకమంది గృహిణులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశారు. వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్‌ చేశారు.

ఈ ఘటనల్లో మద్యం తాగి వచ్చి భార్యను కొట్టిన ప్రబుద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారున్నారు. రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఈ తరహా వేధింపులు జరిగినట్టు దిశ కాల్స్‌లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్‌లోని దిశ యాప్‌ను ఓపెన్‌ చేసి ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్‌ ఫోన్‌ను అటు ఇటు ఊపి (షెక్‌ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించడం విశేషం. దిశ కాల్‌ సెంటర్‌కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో భర్త బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. 

పదినెలల్లో దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు
భర్త వేధింపులు: 267
బయటివారి వేధింపులు: 115
గుర్తుతెలియనివారి వేధింపులు: 69
పనిచోసేచోట వేధింపులు: 67
బంధువుల వేధింపులు: 68
తప్పుడు ఫిర్యాదులు: 22
అసభ్య ప్రవర్తన: 19
మహిళ అదృశ్యం: 13
బాలికలపై అకృత్యాలు: 9
సివిల్‌ వివాదాలు: 8
బాలికల అదృశ్యం: 8
ప్రమాదాలు: 6
పురుషుల అదృశ్యం: 3
వెంటపడి వేధింపులు: 1
మొత్తం: 675

తక్షణం స్పందిస్తున్నాం
దిశ యాప్‌ ద్వారా కాల్‌ సెంటర్‌కు వస్తున్న సమాచారంపై తక్షణం స్పందించి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు 5 నుంచి 12 నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తున్నారు. చాలావరకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్‌లతో సరిపెడుతున్నాం. తీవ్రత ఉన్న వాటిపై గృహహింస, పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేస్తున్నాం. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్‌ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాటవినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశాం.
- దీపికా పాటిల్‌, దిశ ప్రత్యేక అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement