పాలిటెక్నిక్ పబ్లిక్ పరీక్షల పేపర్ వాల్యుయేషన్‌లో రోజుకు 100 పేపర్లు దిద్దాలని ఎగ్జామ్స్ కంట్రోలర్ పెట్టిన మెసేజ్
పాలిటెక్నిక్ పరీక్షలో ఇష్టానుసారం మూల్యాంకనం
రోజుకు 40 పేపర్లు వ్యాల్యూ చేయాల్సిన చోట 100 అందజేత
లక్ష్యంమేర పేపర్లు వ్యాల్యూ చేయగానే అదనంగా వచ్చేలా సాఫ్ట్‌వేర్
ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై తీవ్ర విమర్శలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఎంతో బాధ్యతాయుతంగా మూల్యాంకనం చేయాల్సిన పాలిటెక్నిక్ వార్షిక పరీక్షల జవాబు పత్రాలను ఇష్టానుసారం చేస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్టు లెక్చరర్లను పక్కనబెట్టి, ప్రైవేటు కాలేజీ లెక్చరర్లకు బాధ్యతలు అప్పగించిన అధికారులు.. వ్యాల్యూయేషన్ చేయాల్సిన పేపర్ల టార్గెట్లను రెట్టింపు చేస్తూ లెక్చరర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తమ పని చేసుకుపోతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్’(ఓఎస్‌ఎం) విధానంతో లెక్చరర్లు ఎక్కడి నుంచైనా పేపర్లు దిద్దే వెసులుబాటు కల్పించారు. ఇందులో ఎవరు పేపర్ దిద్దుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాల్యూయేషన్‌లో పాల్గొనే లెక్చరర్లకు లాగిన్ ఐడీలు ఇచ్చినా వారే దిద్దుతున్నట్టు గుర్తించే పరిస్థితి లేదు. దీంతోపాటు రోజుకు ఒక్కో లెక్చరర్ ఎన్ని పేపర్లు దిద్దాలి ? దిద్దిన పేపర్లు పరిశీలన వంటి అంశాలను పూర్తిగా గాలికొదిలేశారు. గతనెల 23న వ్యాల్యూయేషన్ ప్రారంభమైనా ఇంతవరకు లాగిన్ అవ్వని లెక్చరర్లు చాలామందే ఉన్నారంటే పర్యవేక్షణ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్ని దిద్దితే అన్ని పేపర్లు..
32 పేజీలు కలిగిన స్క్రిప్టు పేపర్లు 1.20 లక్షల మంది విద్యార్థుల 7 లక్షల జవాబు పత్రాలను ఒక్కో లెక్చరర్ రోజుకు 40 మాత్రమే దిద్దాలి. కానీ సాంకేతిక విద్యశాఖ ఇంజినీరింగ్ సబ్జెక్టులు 80 పేపర్లు, జనరల్ సబ్జెక్టులైతే 100 మూల్యాంకనం చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేటప్పుడు ప్రతి లెక్చరర్‌కు రోజుకు దిద్దాల్సిన పేపర్లు టార్గెట్ పూర్తికాగానే లాగిన్ క్లోజ్ చేయాలి. అయితే ఆరోజు మూల్యాంకనం లక్ష్యం పూర్తయిన వారికి మరికొన్ని పేపర్లు వచ్చిపడుతున్నాయి.
దీంతో కొందరు లెక్చరర్లు రోజుకు 120 పేపర్లు కూడా వ్యాల్యూ చేస్తున్నట్టు సమాచారం. రోజుకు 40 పేపర్లు మాత్రమే దిద్దితే నాణ్యత ఉంటుందని, వందలాది పేపర్లు వ్యాల్యూ చేయడమంటే విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టడమేనని కొందరు సీనియర్ లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పేపర్లను ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు దిద్దేవారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ‘నో వర్క్–నో పే’ విధానం అమలు చేసి కాంట్రాక్టు లెక్చరర్లను వ్యాల్యూయేషన్‌కు దూరం చేసింది.
కొరవడిన పర్యవేక్షణ
ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. గతంలో పేపర్ల మూల్యాంకనం అనంతరం బుక్‌లెట్‌లోని ప్రతి పేపర్‌ను సరిగా దిద్దారా లేదా అని పరిశీలించి, అనంతరం చీఫ్ ఎగ్జామినర్‌కు పంపేవారు. కానీ ప్రస్తుత విధానంలో మూల్యాంకనం చేసే ఎగ్జామినర్, ఆపైన పరీక్షల కంట్రోలర్ మాత్రమే ఉన్నారు. ఎగ్జామినర్ పేపర్లు దిద్దడం పూర్తవగానే, వారికి మరిన్ని పేపర్లు పంపడం తప్ప.. దిద్దిన పేపర్లలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని పరిశీలించేవారు లేరు.
ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన పేపర్లలో ర్యాండమ్‌గా 10 పేపర్లు చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించాలి. కానీ ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్ ఉన్నా పరిశీలన లేకుండానే బుక్‌లెట్‌లోని చివరి పేజీ మాత్రం చూసి ‘ఓకే’ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆన్‌లైన్ మూల్యాంకనంలో 24 గంటలు పేపర్లు దిద్దే వెసులుబాటు కల్పించామన్నారు. రోజుకు 60 పేపర్లు మాత్రమే వస్తాయని, అంతకు మించి మూల్యాంకనం టార్గెట్లు పెట్టలేదంటున్నారు.


