AP: అతిచిన్న వయసులో కైవల్య రెడ్డి రికార్డు.. నాసా ఐఏఎస్‌పీకి ఎంపిక

AP Student Kaivalya Reddy selected for NASA IASP - Sakshi

నాసా శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం సొంతం

అతి చిన్న వయసులో ఎంపికైన భారతీయురాలిగా కైవల్య రెడ్డి రికార్డు

నిడదవోలు: ప్రతిష్టాత్మకమైన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నేతృత్వంలో నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం (ఐఏ ఎస్‌పీ)–2023కు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి ఎంపికయ్యింది. నాసా భాగస్వామ్య సంస్థ ఏఈఎక్స్‌ఏ ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న 50–60 మంది విద్యార్థులను ఐఏఎస్‌పీకి ఎంపిక చేస్తుంది.  

అన్ని దేశాల విద్యార్థుల నుంచి ప్రాజెక్ట్‌ నమూనాలను, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వాటిలో అత్యుత్తమ నమూనాలు పంపిన విద్యార్థులను ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఇంటర్వూ్యకు హాజరైన కైవల్య రెడ్డి ఎంపికైనట్లు  ఏఈఎక్స్‌ఏ నుంచి సమాచారం అందింది. ఇదే తరహాలో ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు ఐఏఎస్‌పీలో భాగంగా ఆరు నెలలు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తారు. నవంబర్‌లో అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 15 రోజులు వ్యోమగామి శిక్షణ ఇస్తారు. అదే సమయంలో విద్యార్థులను బృందాలుగా ఎంపిక చేసి అనుభవజ్ఞులైన నాసా శాస్త్రవేత్తలతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు.

అతి చిన్న వయసులోనే..
నిడదవోలుకు చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కైవల్య రెడ్డి (15) ఇటీవల పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్‌లో పాసైంది. ఖగోళశాస్త్రంపై ఆసక్తి కలిగిన కైవల్యరెడ్డి అతి చిన్న వయసులోనే ఐఏఎస్‌పీకి ఎంపికైన భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. గతంలో మన రాష్ట్రానికే చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్‌ రెండవ సంవత్సరం చదుతున్న సమయంలో ఈ శిక్షణ పూర్తి చేసింది. 

ఇది కూడా చదవండి: బందరు పోర్టుకు శంకుస్థాపనపై సీఎం జగన్ ట్వీట్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top