ఎన్నికల హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలి
పీఆర్సీ వేసి మెరుగైన వేతన సవరణ చేయాలి
నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి
రిటైరైన ఉద్యోగులు బకాయిలు తీసుకోకుండానే చనిపోతున్నారు
మరణించిన ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించాలి
ప్రభుత్వ శాఖల్లో అన్ని పోస్టులకూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. లేకపోతే తదుపరి చర్యలకు దిగుతాం
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ఉద్యోగులకు వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ కమిషన్ వేసి మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ఖర్చులేని పీఆర్సీ కమిషనర్ నియామకం కూడా ఆలస్యం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పీఆర్సీ ఆలస్యమవుతున్న తరుణంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఆనవాయితీ ప్రకారం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులు మూడేళ్లుగా ఐఆర్ పొందుతున్నారని, మన రాష్ట్రంలో మాత్రం కనీసం పీఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.వేల కోట్ల బకాయిలను తక్షణం చెల్లించాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ సొంత డబ్బు అందక ఆరి్థక ఇబ్బందులతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనూ నెరవేర్చరా?
ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దుర్మార్గమని బొప్పరాజు పేర్కొన్నారు. తక్షణమే హామీలు అమలుచేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల మద్దతుతో తదుపరి చర్యలకు దిగుతామని హెచ్చరించారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించిందన్నారు.
24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు సుమారు రూ.6 వేల కోట్ల సరెండర్ లీవ్స్ బకాయిలు ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో 34 శాతం మంది ఉద్యోగులకు ఆ బకాయిలు అందలేద న్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల సమయం ఇచ్చామని, ఇకపై ఓపిక పట్టే పరిస్థితి లేదన్నారు. ఏపీ జేఏసీ ,అమరావతి, సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏకమై సమస్యలపై ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
జాబ్ క్యాలెండర్‌లో ఖాళీ పోస్టులన్నీ చేర్చాలి
ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో కేవలం పోలీస్, టీచర్ పోస్టులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇతర శాఖల్లో ఖాళీలను పట్టించుకోలేదని బొప్పరాజు ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ముఖ్యంగా జూనియర్ అసి స్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగులపై పని భారం పెరిగి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జూనియర్ అసిస్టెంట్, గ్రూప్–4 ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిని కోరామని చెప్పారు.
ప్రభుత్వంలో భాగమైన లక్ష లాది మంది ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరపాలన్నారు. ఆయన వెంట ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, జేఏసీ మహిళా విభాగం చైర్‌పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, జేఏసీ కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లాశాఖ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.


