రూ.4,361.91 కోట్లతో భావనపాడు తొలిదశ పనులు

AP Govt sanctioned construction Bhavanapadu port first phase cost above Rs 4,361 crore - Sakshi

ఓడరేవు నిర్మాణం కోసం 6,410 ఎకరాల సేకరణ

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు ఓడరేవును తొలి దశలో రూ.4,361.91 కోట్లతో నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 6,410 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్‌ లార్డ్‌ విధానం (తొలుత ప్రభుత్వం అభివృద్ధి చేసి తర్వాత లీజు లేదా విక్రయిస్తారు)లో అభివృద్ధి చేయనున్నారు. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.527.22 కోట్లు సమకూర్చనున్నట్లు పెట్టుబడులు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు.

రైట్స్‌ సంస్థ సవరించిన ప్రాజెక్టు నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఆ మేరకు ప్రభుత్వం భావనపాడు పోర్టు నిర్మాణానికి అనుమతులిచ్చింది. భావనపాడు పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ పోర్టును అభివృద్ధి చేయనుండగా, ఏపీ మారిటైమ్‌ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డు రూ.3,053.34 కోట్ల రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top