‘ఇసుక సరఫరా’కు టెండర్లు | Sakshi
Sakshi News home page

‘ఇసుక సరఫరా’కు టెండర్లు

Published Sun, Jan 3 2021 5:52 AM

AP govt is determined to provide sand to people transparently - Sakshi

సాక్షి, అమరావతి: పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ బాధ్యతల నిర్వహణ కోసం అర్హమైన సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇసుక తవ్వకం, రీచ్‌లు/ స్టాక్‌ పాయింట్ల వద్ద ప్రజలకు సరఫరా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఉత్తమ సంస్థల ఎంపిక అత్యంత కీలకమైనది. అందువల్ల టెండర్ల ద్వారా అర్హత ఉన్న సంస్థలను ఖరారు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌టీసీ)కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని మూడు జోన్లు (విభాగాలు)గా విభజించి ఎంఎస్‌టీసీ బిడ్లు స్వీకరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎంఎస్‌టీసీ ఈ నెల 4వ తేదీన అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. 

13 జిల్లాలు మూడు జోన్లుగా విభజన 
రాష్ట్రంలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా ప్రభుత్వం విభజించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలను ఒక జోన్‌గా పేర్కొంది. అలాగే పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఒక జోన్‌గా, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలను మరొక జోన్‌గా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకం/ సరఫరాకు ఆసక్తిగల సంస్థల నుంచి ఎంఎస్‌టీసీ వేర్వేరుగా బిడ్లు ఆహ్వానిస్తుంది. మొదట టెక్నికల్‌ బిడ్లు నిర్వహిస్తుంది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన ఆర్థిక, నిర్వహణ సామర్థ్యం, అలాగే అనుభవం లాంటి వాటిని ప్రభుత్వంతో చర్చించి ఎంఎస్‌టీసీ ఖరారు చేస్తుంది. దీని ప్రకారం టెక్నికల్‌ బిడ్లు స్వీకరిస్తుంది. వీటిలో అర్హమైన సంస్థల నుంచి ఫైనాన్షియల్‌ బిడ్లు స్వీకరిస్తుంది. తక్కువ మొత్తానికి కోట్‌ చేసిన (ఎల్‌–1గా నిలిచిన) సంస్థలకు వేర్వేరుగా ఆయా ప్రాంతాల్లో ఇసుక నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. 

ప్రజలే ఎంపిక చేసుకోవచ్చు
► ఎంపికైన సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు రీచ్‌లు/ స్టాక్‌ పాయింట్లలో ఇసుకను అందించాల్సి ఉంటుంది. నయాపైసా కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలుండదు. 
► ప్రజలు ఏ రీచ్‌కైనా/ స్టాక్‌ పాయింట్‌కైనా వెళ్లి స్వయంగా పరిశీలించి నాణ్యమైన ఇసుకను ఎంపిక చేసుకోవచ్చు.
► అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని నచ్చిన అద్దె/ సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లవచ్చు. మట్టి ఇసుక వచ్చిందనే మాటే ఉండదు. పరిమాణంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఎంత అవసరమైతే అంత తీసుకెళ్లవచ్చు.
► ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం స్థానే ఆఫ్‌లైన్‌ విధానం ఉంటుంది. అందువల్ల సర్వర్‌ పనిచేయలేదనే బాధలు, ఆన్‌లైన్‌ మోసాలు, సిఫార్సుల ఊసుండదు.
► ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. 

ఎడ్ల బండ్లలో ఉచితమే
► నదీ పరిసర ప్రాంతాల్లోని వారు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుక ను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నిర్మించే సహాయ పునరావాస కాలనీల ఇళ్లకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు.  
► ప్రజలకు ఇసుక కొరత లేకుండా అందుబాటులోకి తేవడం కోసం ప్రభుత్వం ఇప్పటికే 500 ఇసుక రీచ్‌లను గుర్తించింది. వాటికి త్వరగా అన్ని రకాల అనుమ తులు తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో జలవనరులు, భూగర్భ గనుల శాఖలు డ్రెడ్జింగ్‌ ద్వారా పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులోకి తెచ్చే ప్రయ త్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ భారీగా ఇసుక నిల్వలు ఉన్నట్లు కూడా గుర్తించారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement