ఈహెచ్‌ఎస్‌ మరింత పటిష్టం.. ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో బిల్లుల చెల్లింపు

AP Government Employees Federation says thanks to CM YS Jagan - Sakshi

ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీములోకి కొత్తగా 565 చికిత్సలు

ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు.. ఆరోగ్య మిత్రల సేవలు వర్తింపు      రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 

ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కొండంత ఊరట

సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ కృతజ్ఞతలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమును (ఈహెచ్‌ఎస్‌) మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వైద్య బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్‌ స్కీము ద్వారా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల పీఆర్సీపై చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఇతర రాష్ట్రాల్లోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య శ్రీలో చేర్చినా, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీములో కవర్‌ కాని 565 వైద్య విధానాలను ఇప్పుడు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లను మరింత పటిష్టం చేస్తూ ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీము లబ్ధిదారులకు ఆరోగ్య మిత్రలు తగిన సహాయ సహకారాలు అందిస్తూ నగదు రహిత చికిత్సలు అందేలా చూస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవోకు ఉత్తర్వుల్లో సూచించారు. 

ఉద్యోగులకు ఎంతో మేలు
ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 21 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొనడంతో మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని ప్రధాన ఆస్పత్రులు ఈ స్కీమును అమలు చేస్తాయని పేర్కొన్నారు. 565 రకాల కొత్త వైద్య సేవల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top