బతుకులతో బాబు చధరంగం | AP Corn Farmers Fires on Chandrababu Government: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బతుకులతో బాబు చధరంగం

Apr 1 2026 5:46 AM | Updated on Apr 1 2026 5:50 AM

AP Corn Farmers Fires on Chandrababu Government: Andhra Pradesh

విజయవాడలో మార్క్‌ఫెడ్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు

బూటకపు మాటలు నమ్మి మోసపోయాం

రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు  

ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలకుపైగా నష్టమని ఆవేదన 

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ బాబు నాటకాలపై ఆగ్రహం  

కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆక్రందన 

దళారుల పేరిట బాబు బృందమే దోపిడీ చేస్తోందని మండిపాటు  

మార్క్‌ఫెడ్‌ కార్యాలయాన్ని ముట్టడించిన కర్షకులు 

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌  

కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మోసాలపై మొక్కజొన్న రైతులు కన్నెర్రచేశారు. బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కారు. తమ బతుకులతో చంద్రబాబు చదరంగమాడుతున్నారంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌చేశారు. విజయవాడలోని ఏపీ మార్క్‌ఫెడ్‌ కార్యాలయాన్ని మంగళవారం మొక్కజొన్న రైతులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పొగాకు వేయొద్దన్నారని.. మొక్కజొన్న వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని, కొనేవారూ లేక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు పంటను కొనాలని డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు మొక్కజొన్న రైతులు క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య మాట్లాడుతూ బాబు పాల­నలో ఉల్లి మొదలు టమాటా వరకు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి రైతులు నిండా మునిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  ధరల స్థిరీకరణ నిధి ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. కనీసం రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కని పంటలను కొనాలని డిమాండ్‌ చేశారు. దళారుల మాటున కూటమి నేతలే రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రా­లు ప్రారంభించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో  ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్ర­భా­కర్‌ రెడ్డి, ఏపీæ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్ర­ధాన కార్యదర్శి హరిబాబు, పలు జిల్లాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం మార్క్‌ఫెడ్‌ జీఎంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

రూ.1.25 లక్షలు నష్టపోతున్నా 
ఐదెకరాల్లో మినుము, ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా, 3 క్వింటాళ్లకు మించి రాలేదు. మొక్కజొన్న మాత్రం 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచి్చంది. మినుము మద్దతు ధర రూ.8,575 కాగా, మార్కెట్‌లో రూ.7వేలకు మించి కొనేవారు లేరు. క్వింటాకు రూ.1600కుపైగా నష్టపోయాను. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్‌లో రూ.1500–రూ.1700 మధ్య పలుకుతోంది. దీంతో ఐదెకరాలకు రూ.1.25 లక్షలు నష్టపోతున్నా.      – ఎ.రాజశేఖర్, లింగాల, నంద్యాల జిల్లా

పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు 
ఐదెకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు రూ.50­వేలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 30–35 క్వింటాళ్ల మధ్య దిగుబడులొచ్చాయి. మార్కెట్‌లో క్వింటా రూ.1600 నుంచి రూ.1700 మధ్య కొంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.     – మద్దిరెడ్డి వెంకటరెడ్డి,   అనుమల్లంక, గంపలగూడెం, ఎన్టీఆర్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement