పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజలకు మేలు.. కొత్త జిల్లాల అవసరం ఏంటో చెప్పిన సీఎం జగన్‌

AP CM YS Jagan Speech At New Districts Launch - Sakshi

సాక్షి, తాడేపల్లి: జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇవాళ అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో.. కొత్త జిల్లాలను ప్రారంభించిన అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. 

అంతకు ముందు 26 జిల్లాల ఏపీ రాష్ట్రంగా రూపుమారుతున్న సందర్భంగా.. ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు సీఎం వైఎస్‌ జగన్‌. కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన.. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు. 

పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్‌.. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని,  సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని చెప్పారాయన. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏరకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top