‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం

AP CM YS Jagan Focus On Kuppam Development - Sakshi

వైఎస్సార్‌సీపీ హయాంలో మారుతున్న రూపురేఖలు 

ఇప్పటికే మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ 

అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించిన సీఎం 

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు 

రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రాధాన్యం

ఇంటిని చక్కదిద్దుకోలేని నాయకుడు రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేస్తాడో కుప్పం నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకున్న చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రి కాగలిగినా.. వాళ్ల బాగోగులను ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నా ఆ స్థాయిలో ఉండి కూడా మొండిచేయి చూపించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత నియోజకవర్గం అయినప్పటికీ అభివృద్ధికి మారుపేరుగా కుప్పంను తీర్చిదిద్దుతుండటం విశేషం. 

కుప్పం: రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. ఏళ్ల తరబడి పాలించిన టీడీపీ నేతలు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడికక్కడ సమస్యలు తాండవిస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల తో స్థానికులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. ప్రధానంగా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడంతోనే అభివృద్ధికి తొలి అడుగు పడింది. తాజాగా మున్సిపాలిటీ అభివృద్ధికి ము ఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.66 కోట్ల నిధులు విడుదల చేయడంతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి. 

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం 
మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. ప్రస్తుతం డికే పల్లి చెరువు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. అయితే మున్సిపాలిటీ పరిధి పెరగడంతో అన్ని ప్రాంతాలకు పూర్థిస్థాయిలో నీరు అందని పరిస్థితి. ప్రస్తు తం తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. రూ.3.67 కోట్లతో నూతన బోర్లు, పైపులైన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నా రు. అనిమిగానిపల్లె, తంబిగానిపల్లె, పరమసమద్రం, చీగలపల్లె, కమతమూరు గ్రామాల్లో నూతన బోర్ల డ్రిల్లింగ్‌తో పాటు ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. 

రూ.43.5 కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్లు 
పట్టణంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో పాటు సి మెంట్‌ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలో అటవీ సరిహద్దు ప్రాంతం నారాయణపురం సైతం కలవడం వల్ల అక్కడ కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు భారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో రెండో వార్డు చీగలపల్లె, చిన్న చీగలపల్లె, నారాణపురం గ్రామాల్లో పూర్తిస్థాయిలో సిమెంట్‌ రోడ్లు వేయనున్నారు. దీంతో పాటు దాదాపు అన్ని వార్డుల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

నూతన శోభ 
పట్టణం విస్తరిస్తున్నా శివారు కాలనీల్లో కనీసం విద్యుత్‌ దీపాలు కూడా లేకపోవడంతో కొత్త వెలుగులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు రూ.1.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాజావారి పార్కుతో పాటు దళవాయి కొత్తపల్లె పార్కుల అభివృద్ధికి రూ.2.55 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం చెరువు నిండి మొరవ పారుతుండడంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది. పార్కు అభివృద్ధి చెందితే పట్టణం నూతన శోభను సంతరించుకోనుంది. ఇక శ్మశాన వాటికను కూడా రూ.1.38 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. పట్టణంలోని నాలుగు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ, మహిళా కమ్యూనిటీ భవనాలకు రూ.69 లక్షలు కేటాయించడంతో వీటన్నంటికీ మంచిరోజులు రానున్నాయి. ఇలా కుప్పంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.

ఇది పట్టణ నడిబొడ్డులోని డి.కె.పల్లి చెరువు వద్దనున్న ఉద్యానవనం. పేరుకే ఇది ఉద్యానవనం కానీ ఇక్కడ మచ్చుకైనా ఆహ్లాదకర వాతావరణం కనిపించదు. ఇదే కాదు, పట్టణంలోని రాజువారి పార్కులోనూ కనీస సౌకర్యాలు లేక పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఇంత పెద్ద పట్టణంలో ప్రజలు ఉదయం, సాయంత్రం కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామనుకున్నా గత ప్రభుత్వం ఆ మేరకు తీర్చిదిద్దలేకపోయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవతో ఈ రెండు పార్కులకు మంచి రోజులు రానున్నాయి. రూ.2.55 కోట్లతో పార్కులకు మహర్దశ చేకూరనుంది. 

ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి 
కుప్పం నియోజక వర్గంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసిన వెంటనే అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కుప్పం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలు మెచ్చేలా సౌకర్యాలు మెరుగుపరుస్తాం. – డాక్టర్‌ సుధీర్, చైర్మన్, కుప్పం మున్సిపాలిటీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top