
వల్లభనేని వంశీపై కొనసాగుతున్న వేధింపుల పర్వం
జెలు నుంచి బయటకు వస్తారనే అక్కసుతో కేసులపై కేసులు.. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా మరో కేసు
విజయవాడలీగల్ /నూజివీడు/గన్నవరం : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే పదికిపైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. వీటిల్లో కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి ఎక్కడ బయటికి వచ్చేస్తారోననే అక్కసుతో మరిన్ని కేసులను తెరమీదకు తీసుకువస్తూ వేధిస్తోంది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తోన్న వంశీమోహన్ ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం అటు విజయవాడ, ఇటు నూజివీడు కోర్టుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా నమోదైన కేసే ఇందుకు అద్దం పడుతున్నాయి.
టీడీపీ ఆఫీసుపై దాడికేసులో బెయిల్
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఎ71గా ఉన్న మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్‌కు 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న వంశీ తరపున దేవి సత్యశ్రీ,, ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదే కేసులో ఎ81గా ఉన్న లక్ష్మీపతికీ బెయిల్ మంజూరైంది.
రెండువారాల రిమాండ్
వల్లభనేని వంశీకి నూజివీడులోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు శుక్రవారం 14 రోజుల రిమాండ్ విధించింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని నమోదైన కేసుపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు వంశీతో పాటు ఇదే కేసులో ఉన్న ఓలుపల్లి మోహన రంగారావులను నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికీ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రావణి రిమాండ్ విధించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఏ10 కాగా, ఓలుపల్లి మోహన రంగారావు ఏ7గా ఉన్నారు. అనంతరం వంశీని పోలీసులు విజయవాడలోని జిల్లా సబ్‌జైలుకు తరలించారు. వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా, దానిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.

తాజాగా మరో కేసు..ఆపై గోప్యత
తాజాగా గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై వల్లభనేని వంశీమోహన్‌తో పాటు ఇంకొంత మందిపై గన్నవరం పోలీసులు గురువారం మరొక అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తుండడం గమనార్హం. వివరాలిలా వున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రావెల్ తవ్వకాలపై మూడు నెలలు క్రితం సమర్పించిన నివేదిక ఆధారంగా ఆ శాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో ప్రధాన నిందితులుగా వల్లభనేని వంశీమోహన్‌ను చేర్చారు.ఆయనతోపాటు ఓలుపల్లి మోహన్‌రంగా, పడమట సురేశ్, కైలే శివకుమార్‌తో పాటు మరో 10 మందిపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ రావడంతో వంశీ మోహన్ బయటకు వస్తారనే సమయంలో తాజాగా మైనింగ్ కేసును బనాయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది.