
సాక్షి, విశాఖపట్నం: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులపై రిజిస్ట్రార్ దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులు మీడియా ముందు సమస్యలు చెప్పుకుంటున్న సమయంలో వాళ్ల చేతుల్లోంచి మైకు లాక్కున్నారు. పూర్తిగా సమస్యలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారాయన.
ఏయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. పురుగుల అన్నం పెడుతున్నారని, తమ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏయూ రిజిస్ట్రార్‌కు నిరసన సెగ తాకింది. గత రాత్రి నుంచి ఏయూ మెయిన్‌గేట్ వద్ద కొనసాగిన ఆందోళన.. ఈ ఉదయం రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుంది.

పురుగుల అన్నం మాకొద్దు.. నాణ్యమైన ఆహారం అందించాలంటూ నినాదాలు చేశారు. ఆపై రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులకు వాగ్వాదం జరిగింది.

యూనివర్సిటీలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, అవి మారాలంటూ కొంతకాలంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో గత రాత్రి నుంచి అధికారులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే అర్ధరాత్రి దాటాక ఒక దశలో ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు.. వాళ్లు వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఏసీపీ లక్ష్మణమూర్తి తమపై కేసులు పెడతామని బెదిరించినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు.
అయితే.. విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నిసార్లు చెప్పిన తమ సమస్యలపై ఏయూ అధికారులు స్పందించడం లేదని, అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేదని కుండబద్ధలు కొడుతున్నారు.
