నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా.. దిశా యాప్‌ ద్వారా బాలిక ఫిర్యాదు

Andhra Pradesh: Officers Stop Child Marriage After Received Complaints From Disha App Eluru - Sakshi

సాక్షి,ఏలూరు టౌన్‌: తనకు చదువుకోవాలని ఉన్నా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ బాలిక దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన బాలికకు ఈనెల 8వ తేదీన వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు.

తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పినా పెద్దలు వినకపోవడంతో.. ఆమె ఆదివారం ఉదయం 9.37 గంటలకు దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన దిశ సిబ్బంది సమీపంలోని తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంకన్న, సిబ్బందితో కలిసి 10 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకొని.. ఆమెను విచారించారు. ‘ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కనీసం గ్రాడ్యుయేషన్‌ అయినా పూర్తి చేయాలని ఉంది. నా చదువు పూర్తయ్యాక మా అమ్మ, నాన్న చెప్పినట్లే చేస్తా’ అని ఆ బాలిక పోలీసులతో పాటు తన తల్లిదండ్రులకు చెప్పింది.

పోలీసులు కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఆమె చదువును మధ్యలోనే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బాలికకు పెళ్లి చేయడం నేరమని వివరించారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆమెను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలిక సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు, దిశ యాప్‌ తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top