YSR Jayanthi: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

Andhra Pradesh Grandly Celebrates Farmers Day as tribute to YSR Jayanthi - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.. జిల్లా, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) స్థాయిల్లో వేడుకలు నిర్వహిస్తోంది. వీటిలో పెద్ద ఎత్తున రైతులను భాగస్వాములను చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా గత మూడేళ్లుగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

శాఖల వారీగా ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలుత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాక వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం వంటి వాటి ద్వారా లబ్ధి పొందిన రైతులను భాగస్వాములను చేస్తున్నారు. 

రైతన్నల సంక్షేమానికి ఎన్నో మేళ్లు..
వివిధ పథకాల ద్వారా రైతన్నలకు నేరుగా రూ.1,27,633.08 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన విషయాన్ని రైతులకు వివరించనున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి,  వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్, అమూల్‌ ద్వారా పాడి రైతులకు అదనంగా లబ్ధి, ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రభుత్వం లబ్ధి కలిగిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం, వైఎస్సార్‌ జలకళ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్వించి, మోటార్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వీటన్నింటిపై రైతు దినోత్సవ వేడుకల్లో అవగాహన కల్పించనున్నామని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top