1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ శిక్షణ 

Andhra Pradesh Government Foreign Education Advisor Annavarapu Kumar - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు అన్నవరపు కుమార్‌  

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): సీఎం వైఎస్‌ జగన్‌ పరిపూర్ణ సహకారం, మైక్రోసాఫ్ట్‌ సౌజన్యంతో ఏపీలోని 1.62 లక్షల మంది విద్యార్థులకు ఎండ్‌ టు ఎండ్‌  స్కిల్‌ ట్రైనింగ్‌ అందించనున్నట్టు ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్‌ అన్నవరపు కుమార్‌ తెలిపారు. విద్యార్థులకు ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందిస్తోందన్నారు. రూ.69 వేల విలువైన కోర్సును రూ.350 నామమాత్రపు ఫీజుతో 400 కళాశాలల్లో అందిస్తోందని, ఇది సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. ఈ ఫీజును కూడా విద్యార్థుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.

ఇందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విదేశీ విద్య సలహాదారు డాక్టర్‌ అన్నవరపు కుమార్‌తో ‘అమెరికాలో ఉన్నత విద్య’ అనే అంశంపై మంగళవారంఇష్టాగోష్టి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విదేశీ విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు తొలుత అవగాహన అవసరమని, ఆ తర్వాత వారు అనుకున్న లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యమన్నారు. డబ్బులున్న వారు మాత్రమే విదేశాల్లో చదువుకోగలరన్నది కేవలం అపోహ మాత్రమేనన్నారు. అమెరికాలో 4 వేలకు పైగా వర్సిటీలు ఉన్నాయని, వాటిలో 350 పైగా యూనివర్సిటీలు స్కాలర్‌ షిప్‌ సౌకర్యం కల్పిస్తున్నాయని వివరించారు.  

‘అమెరికన్‌ కార్నర్‌’ కీలక పరిణామం 
 ఇటీవల విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో అమెరికా ప్రభుత్వం అమెరికన్‌ కార్నర్‌ను నెలకొల్పిందని అన్నవరపు కుమార్‌ చెప్పారు.  దేశంలోనే ఇది రెండోదని, దీనిద్వారా మన విద్యార్థులకు అమెరికాలో విద్య, అక్కడ అవకాశాల గురించి తరచూ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.  మన రాష్ట్రంలో విదేశీ విద్యకు సంబంధించి ఇదో కీలక పరిణామమని పేర్కొన్నారు. 

గత ప్రభుత్వంలో భారీ అవినీతి 
టీడీపీ హయాంలో విదేశీ విద్యలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని కుమార్‌ గుర్తు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు, ఐ20లు, బ్యాంక్‌ ఖాతాలతో కోట్ల రూపాయలు కాజేశారని పేర్కొన్నారు. ఇదంతా అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై విజిలెన్స్‌ సమగ్ర విచారణ చేస్తోందన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top