జెన్‌కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం 

Andhra Pradesh government in favor of APGenco - Sakshi

ఇవ్వాల్సిందంతా ఇస్తోంది 

సబ్సిడీ సొమ్ముతో సహా సకాలంలోనే విడుదల 

గత ప్రభుత్వంలో ఇలా జరగలేదు 

ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో)ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపు ఆలస్యం అయినప్పటికీ మంగళవారం అందరికీ చెల్లించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 

ఇప్పుడిలా.. 
2019–20 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ విభాగాల విద్యుత్‌ బిల్లులు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కలిపి మొత్తం రూ.12,388.93 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.16,849.27 కోట్లు అందాయి. 2020–21లో రూ.15,299.67 కోట్లు రావాల్సి ఉండగా రూ.12,989.81 కోట్లు ఇచ్చింది. 2021–22లో జనవరి నాటికి రూ.12,632.78 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,947.76 కోట్లు జమచేసింది.  

అప్పుడలా.. 
గత ప్రభుత్వ హయాంలో 2014–15లో రూ.4,099.60 కోట్లు కట్టాల్సి వస్తే రూ.3,953.52 కోట్లు, 2015–16లో రూ.5,302.54 కోట్లకు రూ.4589.96 కోట్లు ఇచ్చారు. 2016–17 నుంచి చెల్లింపులు తగ్గిస్తూ వచ్చారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.6,176 కోట్లకుగాను రూ.4,022.57 కోట్లు, 2017–18లో రూ.6,578.81 కోట్లకుగాను రూ.4,141.96 కోట్లు, 2018–19లో రూ.9,641 కోట్లకుగాను రూ.3,458.85 కోట్లు ఇచ్చారు. దీంతో పాత బకాయిలే చాలావరకు మిగిలిపోయాయి. వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. 

జెన్‌కో నుంచి రోజుకు 57 మిలియన్‌ యూనిట్లు 
ఏపీ జెన్‌కో నుంచి రాష్ట్రానికి 2014–15లో 16,285.4 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ), 2015–16లో 22,044.4 ఎంయూల విద్యుత్‌ వినియోగించారు. 2016–17లో 24,728.8 ఎంయూ, 2017–18లో 20,562 ఎంయూ, 2018–19లో 22,362.2 ఎంయూ, 2019–20లో 22,470 మిలియన్‌ యూనిట్లు, 2020–21లో 16,430 ఎంయూ, 2021–22 జనవరి నాటికి 17,539.4 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను జెన్‌కో నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో రోజుకి సగటున 57.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఏపీజెన్‌కో అందిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top