AP: ఆయుష్మాన్‌భవ: గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు

In Andhra Pradesh 10 Types Of Vaccines For Pregnant women And Infants - Sakshi

వ్యాక్సిన్లతో అనారోగ్యాలకు దూరం

ప్రకాశం జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసుల టార్గెట్‌

ఇప్పటి వరకు 20,603 డోసులు పూర్తి

చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహిస్తోంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వాస్పత్రుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు కోసం ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన నాటి నుంచే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతోంది. అయితే వ్యాక్సినేషన్‌పై అవగాహన లేకపోవడంతో చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.   

ఒంగోలు అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇమ్యూనైజేషన్‌ ప్రక్రియ గర్భిణులు, నవజాత శిశువుల మరణాలకు చెక్‌ పెట్టడంతో పాటు చిన్నారుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి వ్యాక్సినేషన్‌ రక్షణ కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్దేశించిన వాతావరణంలో భద్రపరిచి అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులకు వాక్సిన్లను అవసరం మేరకు సరఫరా చేస్తోంది.

ప్రతి బుధ, శనివారాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో డాక్టర్లు, నర్సులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు లేని గ్రామాలకు ముందు రోజే ప్రజలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై తెలియజేసి బుధ, శనివారాల్లోనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 64 పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు, 8 సీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, మాతా శిశు వైద్యశాల, మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రి, ఒంగోలు జీజీహెచ్‌లో వ్యాక్సిన్‌లు వేస్తారు. ఈ ఏడాదికి జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసులు టార్గెట్‌ ఉండగా ఇప్పటి వరకు 20,603 డోసుల ప్రక్రియ పూర్తయింది. 

టీకాలు.. పది రకాలు 
గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌లు పుట్టిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు నిర్దేశించిన వయసు ప్రకారం ఆయా డోసులు వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్‌కు సంబంధించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్‌ కార్డు ఇచ్చి అందులో వ్యాక్సినేషన్‌ వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్‌) ఈ టీకా గర్భం దాల్చిన తొలి రోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్‌ డోసు వేస్తారు. 

చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌ 
మొదటిగా పుట్టిన సమయంలో బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్‌ జీరో మోతాదుతో పాటు హెపటైటీస్‌ బీ పుట్టిన వెంటనే మోతాదు ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ–1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా–1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్‌ఐపీవీ–1 ఇంజక్షన్‌ (పోలియో రాకుండా), పెంటావాలెంట్‌ (డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్, రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్, రోటా మూడో డోసుతో పాటు ఎఫ్‌ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్‌ వ్యాక్సిన్‌తో పాటు విటమిన్‌ ఏ ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్, ఓపీవీ బూస్టర్‌తో పాటు ఎంఆర్‌ రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్సరాలకు డీపీటీ రెండో బూస్టర్‌ మోతాదు, 10–16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్‌ వేస్తారు.

టీకాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి 
గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డ వరకు సకాలంలో టీకాలు వేయించాలి. టీకాల కాల పరిమితి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల ద్వారా తెలుసుకుని సకాలంలో పిల్లలకు టీకాలు వేయించాలి. టీకాల వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడవచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం నిర్దేశించిన రోజుల్లో క్రమం తప్పకుండా జరుగుతోంది.  
– ఏఎస్‌ దినేష్‌కుమార్, కలెక్టర్‌ 

ఇమ్యూనైజేషన్‌ ప్రక్రియ పక్కాగా పర్యవేక్షిస్తాం 
జిల్లాలో నిర్వహించే ఇమ్యూనైజేషన్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్‌ కార్డులో నమోదు చేస్తున్నాం. ఆశాలు, అంగన్‌వాడీల ద్వారా వ్యాక్సినేషన్‌ సమయాన్ని కూడా తల్లిదండ్రులకు ముందుగానే గుర్తు చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు టీకాలపై అవగాహనతో ఉండి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి పోలియో, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలి. 
– పద్మజ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top