పిల్లలను సముద్రంలోకి వదులుతున్న గిరిజనులు
కడలిలో పర్యావరణ మిత్రులు
ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణకు ప్రాధాన్యం
ఏప్రిల్ నుంచి జూన్ వరకు సముద్రంలోకి ..
ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ సంయుక్త కృషి
ప్రపంచంలోని తీర ప్రాంత దేశాల్లో కడలి కాలుష్యం బారిన పడుతోంది. ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం తారస్థాయికి చేరుకుంటోంది. దీన్ని గుర్తించిన పర్యావరణవేత్తలు కాపాడేందుకు తమ వంతుగా యత్నిస్తున్నారు. ఇదే కోవలో చెన్నైకు చెందిన ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తూ సముద్రంలో ఆలీవ్ రిడ్లీ తాబేళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలోని రెండు తీర మండలాల్లో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, తాబేళ్ల గుడ్లను ఏటా సేకరించి వాటిని జాగ్రత్తగా పొదిగించి పిల్లలైన అనంతరం సముద్రంలోకి వదలుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని వేల కూర్మాలను కడలిలోకి వదిలి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు చేపడుతున్నారు.
చిల్లకూరు: సముద్ర గర్భంలో ఎన్నో జీవజాతులు దాగున్నాయి. అయితే నేడు మానవుల తప్పిదాలతో కడలి రోజురోజుకూ కాలుష్యం బారిన పడుతోంది. దీంతో సముద్రంలో ఉండే పలు రకాల జీవజాతులు మృత్యువాత పడి కనుమరుగైపోతున్నాయి. కడలి గర్భంలో ఉన్న మొక్కలు, పాచి తిని పర్యావరణ మిత్రులుగా ఉండే ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు ఎప్పుడైనా ఒడ్డుకొస్తే, వాటిని పట్టుకొని ఎంతో మంది విక్రయిస్తున్నారు. అదే విధంగా చేపల వేట సాగించే పడవలకు తగిలి మృత్యువాత సైతం పడుతున్నాయి. దీన్ని గుర్తించిన అటవీ శాఖ.. చెన్నైకు చెందిన ట్రీ ఫౌండేషన్ సంస్థతో చేతులు కలిపి తాబేళ్ల సంరక్షణకు సిద్ధమయ్యారు.
పుట్టిన చోటే గుడ్లు పెడుతూ..
ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు భూమ్మీదికి వచ్చిన వారం తర్వాత జీవన ప్రక్రియను కొనసాగించేందుకు సముద్రంలోకి వెళ్తాయి. కొన్ని వేల మైళ్ల దూరం ప్రయాణించడం వీటి ప్రత్యేకత. అలా వెళ్లిన ఇవి 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు వచ్చాక గుడ్లు పెట్టే సమయానికి తామెక్కడ పుట్టి సముద్రంలోకి అడుగుపెట్టాయో అక్కడికే రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆపై గుడ్లు పెట్టిన అనంతరం తిరిగి సముద్రంలోకి వెళ్లిపోవడం వీటి ప్రత్యేకత.
జీవనమే వైవిధ్యం..
ఆలీవ్ రిడ్లీ తాబేలు జన్మించిన సమయంలో 50 గ్రాముల బరువే ఉంటుంది. ఇది సుమారు 100 నుంచి 150 ఏళ్ల వరకు జీవిస్తుంది. సముద్రంలోని నాచు, చిన్నపాటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఆపై సుమారు 30 నుంచి 50 కిలోల బరువు వరకు పెరుగుతాయి. కడలిలో సుమారు రెండు వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి ఆహారాన్ని తీసుకుంటాయి. సముద్రంలో ఎక్కడ అడుగుపెడుతుందో 12 ఏళ్ల తర్వాత అక్కడికే వచ్చి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు 20 నుంచి 35 డిగ్రీల వేడిని మాత్రమే తట్టుకోగలవు. సగటున 80 నుంచి 160 గుడ్లను పెట్టడం వీటి ప్రత్యేకత.
సంరక్షణే.. పరమావధిగా
తాబేళ్ల సంరక్షణే లక్ష్యంగా ట్రీ ఫౌండేషన్ సంస్థ స్థానికంగా ఉండే అటవీ అధికారులతో చేతులు కలిపింది. కొంత కాలంగా ఏటా సముద్రపు ఒడ్డున తాబేళ్లు పెట్టే గుడ్లను సంరక్షించి వాటి నుంచి వచ్చే పిల్లలను సముద్రంలోకి జాగ్రత్తగా పంపుతున్నారు. దీనికి సంబంధించి తీర ప్రాంతంలోని మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణను సైతం ఇచ్చారు. గుడ్లను రాత్రి వేళ వీరు సేకరిస్తారు. వీటిని పెట్టే సమయంలో ఎంత మేర గుంత తవ్వుతుందో అంతే లోతులో తవ్వి సంరక్షణ కేంద్రాల్లో పొదిగేలా చేస్తున్నారు. పుట్టిన తాబేళ్లను వారం వరకు సంరక్షణ కేంద్రంలోనే ఉంచి, ఆ తర్వాత సముద్రంలో వదలడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.


