కల్తీ నెయ్యి కేసుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ | Ambati Rambabu Slams Chandrababu to Diversion Politics Amid Cyclone montha | Sakshi
Sakshi News home page

Cyclone Montha: కల్తీ నెయ్యి కేసుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ

Oct 31 2025 7:54 PM | Updated on Oct 31 2025 8:58 PM

Ambati Rambabu Slams Chandrababu to Diversion Politics Amid Cyclone montha

సాక్షి,తాడేపల్లి: తుఫాన్‌లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల కల్తీ లడ్డు పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దేవుడి పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆ దేవుడు, ప్రజలు కూడా క్షమించరని హెచ్చరించారు.
 
లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఆసత్య ఆరోపణలపై సమగ్రమైన విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్ధాన్ని ఆశ్రయిస్తే... సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలను ఇప్పటికీ చంద్రబాబు బదులివ్వలేదని అంబటి స్పష్టం చేశారు. కేవలం వైఎస్సార్‌ర్సీపీ నేతలపై కక్ష సాధింపు కోసం దేవుడిని కూడా వాడుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.  వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు.. పర్చేజింగ్ కమిటీలో ఉన్న కొలుసు పార్ధసారధి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు సభ్యులుగా ఉన్నా.. ఎల్లో మీడియా వారి పేర్లు ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  ఇంకా ఆయన ఏమన్నారంటే..

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్..
గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు.  మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాలని తండ్రీకొడుకులు వేదన రాష్ట్రంలో ఉంటే... వీటిని ఏదో ఒక విధంగా చంద్రబాబు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగమే చిన్నప్పన్న అరెస్టు. ఈ అరెస్టు ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైన వైవీ సుబ్బారెడ్డి మీద బురజ జల్లే కార్యక్రమం ఉధృతం చేస్తున్నారు. సిట్‌ను నడిపిస్తున్న ఎల్లో మీడియాలో కధనాలు చూస్తే... సుబ్బారెడ్డి గారెపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు చేష్టల వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందూవులు తీవ్రంగా బాధపడుతున్నారు.

సుప్రీం ప్రశ్నలకూ బదులివ్వని చంద్రబాబు..
చంద్రబాబు తిరుపతి లడ్డూలో పంది, పశు కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్న అసత్యమైన ఆరోపణ చేశారు. అది కోట్లాది మంది భక్తులు తిన్నారని కూడా చెప్పాడు. ఇది ఆధారాల్లేని అపవాదు. దీని మీద వైయస్సార్సీపీ పార్లమెంటరీ నాయకుడు వై వీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ  సందర్భంగా  సుప్రీంకోర్టు అనేకమైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెబుతారు అని అడిగింది. అంతే కాకుండా లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందా ? లేదా? తేల్చండి అని కూడా చెప్పింది. 

మరోవైపు అప్పటి ఈవో శ్యామలరావు మాట్లాడుతూ నెయ్యిని ఎన్ డీ బీ ల్యాబ్ కు పంపించాం. వారు వనస్పతిలాంటిది కలిసిందని సర్టిఫై చేస్తూ... కింద ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు. పశువులు తినే మేత, టైమింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది.. అని రాసిన డిస్ క్లైమర్ కూడా మీడియాకు చదివి వినిపించారు. ఆ నెయ్యిని వాడలేదు, వెనక్కి తిరిగి పంపించామని చెప్పారు.  చంద్రబాబు గారు మాత్రం కేవలం రాజకీయ దురద్దేశ్యంతో ఆ నెయ్యి వాడారని... కల్తీ జరిగిందని చెప్పారు. ఈవో ఒక మాట, చంద్రబాబు మరో మాట ఎలా చెబుతారు? 

ఎన్ డీ బీ ల్యాబ్ ఒక్కటే ఉందా? సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మొత్తంగా నెయ్యిలో కల్తీ కలిసిందా ? లేదా? అన్నది తేల్చండి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు మాత్రం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.  అందులో భాగంగానే సుబ్బారెడ్డి గారి దగ్గర 8 సంవత్సరాలు క్రితం పీఏ గా పనిచేసిన చిన్నప్పన్నను ఈ ఏడాది మే 31న విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. జూన్ 6న సిట్ ఎదుట చిన్నప్ప హాజరైతే...విచారణ అనంతరం ఆయన ఒక వీడియో విడుదల చేసి.. విచారణ పేరుతో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను బలవంతం చేశారు, నేను చెప్పలేదు స్పష్టం చేశారు. 8 సంవత్సరాల క్రితం పనిచేసిన చిన్నప్పన్నను ఆ రోజు అరెస్టు చేయకుండా 4 నెలల తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సుబ్బారెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం  చేస్తున్నాను.

దేవుడి పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపు
నేను ఇవాళ చంద్రబాబు, సిట్ అధికారులు, ఎల్లో మీడియాను ప్రశ్నిస్తున్నాను. చిన్నప్పన్న కేవలం సుబ్బారెడ్డి గారి దగ్గర మాత్రమే పనిచేయలేదు.. ఆయన అధికార పార్టీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దగ్గర కూడా పీఏగా పనిచేశారు. వారి గురించి సిట్, ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడ్డం లేదు. అంటే వాళ్లు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో చేరి పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ల గురించి రాయడం లేదా? అంటే మీ టార్గెట్ కేవలం వైయస్.జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులేనా? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధిస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పార్ధసారధి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరూ సభ్యులే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు వారి ప్రస్తావన ఎందుకు తేవడం లేదు? చిన్నప్పన్న వాళ్ల దగ్గర కూడా పనిచేసినా సుబ్బారెడ్డి పేరే వస్తుంది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పర్చేజింగ్ కమిటీలో న్న వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి... వారిని విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదన్నట్టు దుర్మార్గమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 

కిలో రూ.320కు ఆవునెయ్యి కొంటున్నారు. కల్తీ కాకపోతే అంత తక్కువ ధరకు వస్తుందా? స్వచ్చమైన నెయ్యి అయితే రూ.3వేలు అవుతుందని కూడా ప్రచారం చేశారు. ఈనాడు అయితే స్వచ్ఛమైన నెయ్యి కేజీ రూ.1000 నుంచి రూ.1600 ఖరీదు చేస్తుంది. రూ.320 కు కొన్నారంటే అది కల్తీ నెయ్యి తేల్చిపారేశారు. నేను టీటీడీ బోర్డును ప్రశ్నిస్తున్నాను.. ఇప్పుడు కేజీ నెయ్యి రూ.3వేలకు కొంటున్నారా? రూ.1600 కు కొంటున్నారా? కనీసం రూ.1000కు కొంటున్నారా? రూ.320 కంటే ఎక్కువ, రూ.1000 కన్నా తక్కువకు కొంటున్నారు. మీరు చెప్పిన వాదన ప్రకారం ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మమంటారా? సమాధానం చెప్పాలి.

మీ కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం సిద్ధం..
2014-19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ కేజీ నెయ్యి రూ.276లకే కొనుగోలు చేసింది. అది మాత్రం స్వచ్చమైన నెయ్యి. ఆయన దిగిపోగానే రూ.320 కి కేజీ నెయ్యి కొంటే అది కల్తీ నెయ్యి, అందులో జంతుకొవ్వు కలిసిందంటూ అపవిత్రమైన మాటలు మాట్లాడిన చంద్రబాబు భ్రష్టు పట్టించారు.  సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.  సుప్రీం కోర్టు అడిగిన స్పష్టమైన ప్రశ్నలకు చంద్రబాబు ఈ రోజు వరకూ సమాధానం చెప్పలేని స్ధితిలో ఉన్నారు. కేవలం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకుని వైయస్సార్సీపీ మీద రాజకీయ కక్ష సాధించాలని చంద్రబాబునాయుడు దుర్మార్గమైన పాప కార్యం చేస్తున్నారు. పీఏ చిన్నప్పన్న దగ్గర ఒక్క రూపాయి పట్టుకున్నది లేదు. కానీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని మీరు చేసే నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాము.

కల్తీ లిక్కర్ కేసులో నిందితులైన మీ పార్టీ నేతలు ఎక్కడ ?
మా పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు. చాలా రకాలుగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేసి .. కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారెకి చెందిన ప్రైవేటు వ్యాపారులే కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీమద్యం తయారీలో అతిపెద్ద నిందితుడు,  ఆ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం సమన్వయకర్త  జయచంద్రారెడ్డి మాత్రం పోలీసులుకు దొరకడు. ఆయన బావమరిది గిరిచంద్రారెడ్డి, పీఏ రాజేష్ లు కూడా దొరకరు. ఎందుకంటే వాళ్లు దొరికితే వాస్తవాలన్నీ బయటపడతాయి. దాన్ని కూడా వైయస్సార్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి వద్దకు ప్రశ్నించడానికి వెళ్లాడని జోగి రమేష్ పై కక్ష కట్టి.... బెయిల్ రాకుండా నెలల తరబడి జైల్లో పెట్టాలని చూస్తున్నారు.

కేవలం వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం, వారి ఆధ్వర్యంలోని సిట్ పనిచేస్తోంది. మీ కక్ష సాధింపు చర్యలకు చివరకు దైవాన్ని కూడా అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గమని అంబటి ఆక్షేపించారు. ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను ఆపకపోతే ఆ దేవ దేవుడి మిమ్మల్ని క్షమించడని, జరుగుతున్నదాన్ని గమనిస్తున్న ప్రజలు కూడా మిమ్నల్ని క్షమించరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement