‘మావిగన్‌’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’ | Ambati Rambabu Comments on ys Jagan MAVIGAN Vision | Sakshi
Sakshi News home page

‘మావిగన్‌’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’

Apr 3 2026 5:25 PM | Updated on Apr 3 2026 6:56 PM

Ambati Rambabu Comments on ys Jagan MAVIGAN Vision

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘మావిగన్‌’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్‌లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా  వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.

అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే...
    
జగన్ చెప్పిన మావిగన్‌పై రాష్ట్రంలో చర్చ
రెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం  తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు  50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.

2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు
2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.

2028-29కి ఈ ఏడు బిల్డింగ్‌లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు  బిల్డింగ్‌లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో  వైఎస్‌ జగన్‌ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.

ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2  లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.

మావిగన్‌  ట్రోలింగ్స్‌కు వైఎస్సార్సీపీ భయపడదు
అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.

ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్‌లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.

20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ 
ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.

చంద్రబాబే ఊసరవెల్లి
2014లో  రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్‌మోహన్‌ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్‌ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్‌ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement