సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవలు: ఆళ్ల నాని

Alla Nani Opened A New secretariat In Srinivasapuram - Sakshi

సాక్షి,జంగారెడ్డిగూడెం రూరల్‌: సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని, సచివాలయాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ రామచర్లగూడెంలో విజయ హాస్పిటల్స్‌ ఐకేర్‌ ఆస్పత్రిలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని నాని ప్రారంభించారు. సచివాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఎన్ని వేవ్‌లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని  మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో రాష్ట్రంలో పరిపాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆ సమస్య నెల రోజుల్లో పరిష్కారం చూపి పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, జెడ్పీటీసీ అభ్యర్థి పోల్నాటి బాబ్జి, సర్పంచ్‌ యడ్లపల్లి దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు పీపీఎన్‌ చంద్రరావు, ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, విజయ హాస్పటల్స్‌ ఐకేర్‌ వైద్యులు విజయభాస్కరరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top