లోతట్టు ప్రాంతాలు జలమయం

Alla Nani And Kursala Kannababu Comments About Flood Relief Programs - Sakshi

ఉభయగోదావరి జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు

‘పశ్చిమ’లో ఇద్దరి మృతి

కాకినాడ, ఏలూరు, విజయవాడల్లో పల్లపు ప్రాంతాలు జలమయం

పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

పడవల ద్వారా బాధితులకు ఆహారం, తాగునీరు, మందుల పంపిణీ

బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,మంత్రి కురసాల కన్నబాబు భరోసా 

సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి/అమరావతి బ్యూరో/అమలాపురం/జగ్గంపేట/కర్నూలు (అగ్రికల్చర్‌): తెలంగాణ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది. ఏలూరులో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించి రెండుచోట్ల భారీ గండ్లు పెట్టించడంతో ఏలూరు ముంపు నుంచి తప్పించుకుంది. నగరంలో ఆరు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమ్మిలేరు కాల్వపై నిర్మించిన వంతెనకు కృష్ణా జిల్లా వైపు గండిపడే ప్రమాదం ఉండటంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఎర్రకాల్వకు, దెందులూరు మండలం సత్యనారాయణపురంలో గండేరువాగుకు రెండు గండ్లు పడ్డాయి. దీంతో జోగన్నపాలెం, దోసపాడు, దెందులూరు దళితవాడల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. భీమవరం మండలం తోకతిప్పలో వర్షానికి రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి చెందింది. కామవరపుకోట మండలం అడమిల్లిలో చేపలు పట్టడానికి వెళ్లి బాలస్వామి మరణించాడు. 

‘తూర్పు’లో ముంపులోనే పలు ప్రాంతాలు 
తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకికాడ నియోజకవర్గాలు ముంపు బారిన పడ్డాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్‌ ముంపు నీరు కాకినాడ శివారులో ట్రెజరీ కాలనీ, టీచర్స్‌ కాలనీ, రమణయ్యపేట జనచైతన్య కాలనీలను ముంచేసింది. అధికారులు పడవలపై వెళ్లి బాధితులకు ఆహారం, నీరు, మందులు అందజేశారు. జగ్గంపేట మండలం రామవరంలో వరద ఉధృతికి ఇల్లు కూలిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 10.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మెట్టలో తాండవ, పంపా రిజర్వాయర్ల గేట్లు మూసివేశారు. కరపలో ముంపుబారిన పడిన వరి చేలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు విజయవాడలో రాణీగారితోట, కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్, రణవీర్‌నగర్, బాలాజీ నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో 44 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. 
నీట మునిగిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎఫ్‌సీఐ కాలనీ 

తూర్పు గోదావరి జిల్లాలో పది మందిని కాపాడిన హోంగార్డ్‌
ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న పదిమంది కార్మికులను కాపాడిన ఓ హోంగార్డ్‌ సాహసం అందరి ప్రశంసలు పొందింది. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో బుధవారం పోలవరం ఎడమ కాలువ, పుష్కర కాలువలకు గండ్లు పడి వరదనీరు భారీగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో బయటకు వచ్చే దారిలేక రామవరం వద్ద సిరామిక్‌ ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. వీరిని రక్షించేందుకు హైవే మొబైల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్‌ అర్జున్‌ నడుము లోతు నీళ్లల్లోనే వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతడి సాహసాన్ని హోం మంత్రి సుచరితతోపాటు పలువురు అభినందించారు.

కోస్తా, సీమకు మోస్తరు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉత్తర కోస్తా, తెలంగాణలపై అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఉంది. కాగా, గత 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top